
- జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించాం
- రాష్ట్రంలో బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం
- అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి నల్గొండలోని బక్కతాయికుంట వద్ద రూ.20.22 కోట్ల అంచనాతో బక్కతాయకుంట లిఫ్ట్ ఇరిగేషన్, రూ.6.8 కోట్లతో పునుగోడు ఎత్తిపోతల పథకం, రూ.19.95 కోట్లతో నర్సింగ్ బట్ల ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. రూ.36 కోట్లతో కలెక్టర్ కార్యాలయంలో నిర్మించనున్న అదనపు బ్లాక్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు ఎదుల ద్వారా నీరందించేందుకు రూ.1800 కోట్లను మంజూరు చేసి పనులు మొదలుపెట్టామన్నారు.
హైలెవల్ కెనాల్ కు రూ.442 కోట్లు మంజూరు చేశామని, పిల్లాయిపల్లి కాల్వ, శివన్నగూడెం నుంచి నారాయణపూర్, చౌటుప్పల్ కు సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్పనిసరిగా మంజూరు చేస్తామని ప్రకటించారు. దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ తోపాటు మరో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లు, ఐటిపాముల లిఫ్ట్ పనులు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మేలు చేసే నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేసి త్వరలోనే స్టేజీ వన్ ద్వారా సాగునీరు ఇస్తామన్నారు. రాచకాల్వ పనులు, గంధమల్ల ప్రాజెక్టును కంప్లీట్చేస్తామని చెప్పారు. పెళ్లిపాకల, గాజుపేట లిఫ్ట్ ఇరిగేషన్ ను పూర్తి చేస్తామని, దేవాదుల నుంచి తుంగతుర్తికి సాగునీరు తెస్తామని చెప్పారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం :
పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని, ప్రతినెలా ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆర్ అండ్ బీ రహదారుల్లో భాగంగా రూ.1600 కోట్లు మంజూరు చేసామని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. రూ.36 కోట్లతో 9 నెలల్లో నూతన కలెక్టర్ భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే డీఈవో, డీఎంహెచ్ వో కార్యాలయాలు సైతం ఒకేచోటుకి వస్తాయని తెలిపారు. అనంతరం ఐదుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల కింద ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు.
అంతకుముందు జిల్లా పోలీస్ కార్యాలయంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన అమరవీరుల స్మారక భవనాన్ని మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు బాలూనాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి, మందుల సామేల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి, ఇన్చార్జి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ నారాయణ్ అమిత్, అడిషనల్ కలెక్టర్ రాజ్ కుమార్, ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ అజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
రికార్డు స్థాయిలో ధాన్యం..
కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. యాసంగి ధాన్యం కలుపుకొని మొత్తం 2,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి రికార్డు సృష్టించామని చెప్పారు. స్వాతంత్ర్య భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండించని విధంగా నల్గొండ జిల్లాలో ధాన్యం పండించామని పేర్కొన్నారు. సన్నధాన్యాన్ని ఉచితంగా 85 లక్షల జనాభాకు ఆరు కేజీల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో పండించిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.