ఇండియా కూటమి  అధికారంలోకి రావడం ఖాయం : ఉత్తమ్​కుమార్ రెడ్డి 

హుజూర్​నగర్, వెలుగు: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని నీటి పారుదల, పౌరసరఫరాలశాఖల మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజూర్​నగర్​ నియోజకవర్గంలోని పలు పార్టీల ముఖ్యనాయకులు, కార్యకర్తలు గురువారం హైదరాబాద్​లోని గాంధీభవన్ లో మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరినవారికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఇన్​చార్జి, మలిదశ ఉద్యమకారుడు  శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో  శ్రీకాంతాచారి అమరుడయ్యాడని, అతడి తల్లి శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ మరవదని మంత్రి తెలిపారు. పార్టీలో చేరినవారంతా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చక్కర వీరారెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, గెల్లి రవి, తన్నీరు మల్లికార్జునరావు, దొంతగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.