రెండేండ్లలో ఎస్ఎల్​బీసీ టన్నెల్ పూర్తి : ఉత్తమ్ కుమార్​రెడ్డి

రెండేండ్లలో ఎస్ఎల్​బీసీ టన్నెల్ పూర్తి : ఉత్తమ్ కుమార్​రెడ్డి
  • సవరించిన అంచనాల మేరకు 4,650 కోట్లు కేటాయింపు
  • శ్రీపాద ఎల్లంపల్లి పెండింగ్ పనులు పూర్తి చేస్తాం 
  • ఏ కేటగిరీలో చనాక కొరాట.. 3 కాలువ పనులకు రూ.294.18 కోట్లు మంజూరు  
  • ప్రాజెక్టుల భూసేకరణలో ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలి 
  • ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానాలు

హైదరాబాద్, వెలుగు: రెండేండ్లలో ఎస్ఎల్ బీసీ టన్నెల్​ పనులను పూర్తి చేస్తామని, అందుకు సవరించిన అంచనాలకు అనుగుణంగా రూ.4,650 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.  టన్నెల్ బోరింగ్ మిషన్ కోసం అమెరికా నుంచి అత్యాధునిక యంత్ర సామగ్రిని  దిగుమతి చేసుకుంటామని,  ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వం తరఫున  అమెరికాలో పర్యటించి వచ్చారని చెప్పారు.  గురువారం  అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్ రెడ్డి, విప్ లు బీర్ల ఐలయ్య యాదవ్, ఆది శ్రీనివాస్, మందుల సామేల్, హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేజేశ్వర్ రెడ్డి, పాయల శంకర్, రామారావు పాటిల్ అడిగిన పలు ప్రశ్నలకు ఉత్తమ్​ కుమార్​రెడ్డి సమాధానం ఇచ్చారు. 

డిండి ప్రాజెక్ట్ కు కావాల్సిన నీటి మూలాలపై నెల రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ‘‘బునదిగాని, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువల నిర్మాణాల పూర్తికి రూ.294.18 కోట్లను విడుదల చేస్తూ జీఓ జారీ చేశాం.  ఈ కాలువల నిర్మాణాలు పూర్తయితే  నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాలకు చెందిన 66 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది”  అని వెల్లడించారు. అయిటిపాముల ఎత్తి పోతల పథకానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, భూసేకరణ చేపట్టాల్సి ఉందని, ఈ బాధ్యత స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యవేక్షిస్తారని తెలిపారు.  

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.81 లక్షల  కోట్లు ఖర్చు చేసి తక్కువ ఆయకట్టు సేద్యంలోకి తెచ్చిందని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పేర్కొన్నారు.  కాస్ట్ బెనిఫిట్  రేషియో చూసుకొని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.  బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ప్రాజెక్ట్ భూసేకరణకు రూ.37 కోట్ల విడుదల చేసిందని, వారంలో మరో రూ.22  కోట్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.  ప్రాధాన్యతా క్రమంలో ఏ, బీ కేటగిరీలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా  రూట్ మ్యాప్ రూపొందించామని చెప్పారు. 

చనాక కొరాట ను ‘ఏ’ కేటగిరీలో పూర్తి చేయనున్నట్టు తెలిపారు.  శ్రీపాద ఎల్లంపల్లి పెండింగ్ పనులు పూర్తి చేయడంతోపాటు పిప్లి ఎత్తిపోతల పథకం, దేవాదుల పూర్తికి ఆదేశాలు జారీ చేశామన్నారు. భూసేకరణ, ప్రాజెక్ట్ వర్క్ లపై సమీక్షా, సమావేశాలు నిర్వహించామని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇదే ప్రాజెక్ట్ కింద స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట ఎత్తిపోతల పథకానికి రూ.160 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. 

బస్వాపూర్ రిజర్వాయర్ పనులు చేపట్టిన గత ప్రభుత్వం భూసేకరణకు నిధులు విడుదల చేయలేదని చెప్పారు. ఆ రిజర్వాయర్ కు సరిపడా భూసేకరణ కోసం రూ.100 కోట్లు అవసరమని, రూ.50 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. గంధమల్ల ప్రాజెక్ట్ కు భూసేకరణ సమస్యగా మారిందని, దీన్ని  దృష్టిలో పెట్టుకొని 1.5 టీఎంసీల  కెపాసిటీని తగ్గించి మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెప్పారు.
 
రాష్ట్రవ్యాప్తంగా లిఫ్ట్​లకు మరమ్మతులు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లిఫ్ట్ లను మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తామని మంత్రి ఉత్తమ్​ అన్నారు. గడ్డెన్న వాగు లైనింగ్ అంశాన్ని  ప్రస్తావిస్తూ నీటి లభ్యత ఉన్న ప్రతి చోట తక్కువ ఖర్చుతో ఎక్కువ  ఆయకట్టు సేద్యంలోకి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు.   ‘‘రాష్ట్రవ్యాప్తంగా మినీ ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. గత ప్రభుత్వం మేజర్ , మీడియం, మైనర్ ఇరిగేషన్ లను కలపడంతో ఓఅండ్ ఎం లేక అవి నిర్వీర్యంగా మారాయి. ఎత్తిపోతల పథకాల పరిరక్షణలో ప్రజాప్రతినిధులు, రైతులు భాగస్వామ్యం కావాలి. 

 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ట్రాన్స్ ఫార్మర్స్​, ఇతర విద్యుత్ పరికరాలు చోరీ అవుతున్నాయి.  అటు రైతులు, ఇటు ప్రభుత్వానికి నష్టం కలుగుతున్నది.  గడిచిన పదేండ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం లిఫ్ట్ లను నిర్లక్ష్యం చేసింది.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే కాలువలు, లిఫ్ట్ ల పరిరక్షణకు 1,800 లష్కర్ ఉద్యోగ నియమకాలు చేపట్టాం. 687 ఏఈఈఈ ఉద్యోగాలను భర్తీ చేశాం. 

మరో 1,238 ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతించాం.  ఎంపికైన 687 ఏఈఈ లలో వంద మందికి పైగా ట్రిపుల్​ ఐటీ, ఐఐటీలకు చెందిన వారు ఉండడం నీటిపారుదల శాఖకు గర్వకారణం” అని ఉత్తమ్ పేర్కొన్నారు.  ప్రాజెక్ట్ ల నిర్మాణాలలో భూసేకరణ సున్నితమైన సమస్యగా మారిందని,  ప్రాజెక్ట్ లు మొదలు పెట్టిన రోజునే భూసేకరణ చేస్తే సమస్యలు ఉత్పన్నం కావని చెప్పారు.  ఇకపై భూసేకరణ అంశంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలన్నారు.  

సంక్రాంతి తర్వాత రేషన్​ కార్డులు 

సంక్రాంతి తర్వాత అర్హులందరికీ రేషన్ ​కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మర్రి రాజశేఖర్​ రెడ్డి ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.  పీడీఎస్​ బియ్యాన్ని అక్రమంగా తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇటీవల పీడీఎస్​ దందాకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్​ నమోదు చేశామని చెప్పారు.  జనాభా ప్రాతిపదికన కొత్త రేషన్​ కార్డులను మంజూరు చేస్తామని వెల్లడించారు. 

రేషన్​లో అదనపు  వస్తువులు ఇచ్చే విషయంపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  ఇప్పటి వరకు ఒక వ్యక్తికి ఆరు కిలోల  దొడ్డు బియ్యం ఇస్తున్నామని, త్వరలో సన్న బియ్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. రేషన్​ డీలర్లకు ఇన్సూరెన్స్​ విషయం పరిశీలిస్తామని చెప్పారు.  కేంద్రం రేషన్​ కార్డులున్న వారికి డైరెక్ట్​ క్యాష్​ ఇవ్వాలని యోచిస్తుందన్న అంశం తమ దృష్టికి రాలేదని,  తమ ప్రభుత్వం మాత్రం రేషన్​ ఇస్తుందని చెప్పారు.