వరి సాగులో.. తెలంగాణ నంబర్‌‌ 1 : మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి

వరి సాగులో.. తెలంగాణ నంబర్‌‌ 1 : మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి
  • ఈ సీజన్​లో 66.7 లక్షల ఎకరాల్లో పంట
  • రికార్డ్‌‌ స్థాయిలో 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది
  • సలహాలు, సూచనలు తీసుకునేందుకే రైతు సదస్సు
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మహబూబ్‌‌నగర్‌‌, వెలుగు : దేశంలో అత్యధికంగా వరిసాగు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో నిలిచిందని ఇరిగేషన్‌‌ శాఖ మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి చెప్పారు. మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా భూత్పూర్‌‌ మండలం అమిస్తాపూర్‌‌ వద్ద ఏర్పాటు చేసిన ‘రైతు పండుగ’ కార్యక్రమానికి శుక్రవారం ఆయన చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరయ్యారు. ముందుగా సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్‌‌ను పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సీజన్‌‌లో రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగగా, 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. 

ఇప్పటివరకు ఇదే రికార్డ్‌‌ అని చెప్పారు. ప్రభుత్వం సైతం దొడ్డు వడ్లను మద్దతు ధరకు కొనుగోలు చేసిందన్నారు. సన్నాలకు మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాల్‌‌కు రూ.500 బోనస్‌‌ చెల్లిస్తున్నామని తెలిపారు. రైతు పండుగ ఏర్పాట్లు, స్టాళ్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం రైతు పక్షపాతిగా పనిచేస్తోందని చెప్పారు. 

Also Read :- ఫార్మా విలేజ్ ప్లేస్‌లో మల్టీపర్సస్ ఇండస్ట్రియల్ పార్క్

రుణమాఫీ చేస్తామని చెప్పిన గత పాలకులు.. మొదటి ఐదేండ్లు కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేశారని విమర్శించారు. తర్వాత అరకొరగా మాఫీ చేసి చేతులెత్తేశారన్నారు. కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాక 21 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని గుర్తు చేశారు. పెండింగ్‌‌లో ఉన్న మరికొందరు రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రకటన చేస్తారని చెప్పారు. 

పాలమూరులో రెండు పామాయిల్‌‌ మిల్లుల ఏర్పాటు : తుమ్మల

రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకే రైతు సదస్సు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతుల నుంచి అభిప్రాయాల మేరకు వారికి మేలు చేసేలా స్కీమ్‌‌లను రూపొందిస్తామన్నారు. పామాయిల్‌‌ సాగుతో అనేక లాభాలు ఉంటాయని చెప్పారు. పాలమూరు జిల్లాలో త్వరలో రెండు పామాయిల్‌‌ మిల్లులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘పాలమూరు’ స్కీమ్‌‌ను త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్‌‌ శాఖ మంత్రి ఉత్తమ్‌‌ను కోరారు. ఎండాకాలం పంటలో మార్చి లోపల కోతలు ప్రారంభిస్తేనే నూకలు తక్కువ అవుతాయని, లేకుంటే బియ్యంలో నూక శాతం ఎక్కువగా ఉంటుందన్నారు.

 అందువల్ల ఎండాకాలం పంటకు నీరు ఎప్పుడూ విడుదల చేస్తారో త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్లానింగ్‌‌ కమిషన్‌‌ వైస్‌‌ చైర్మన్‌‌ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి, జి.మధుసూదన్‌‌రెడ్డి, జనంపల్లి అనిరుధ్‌‌రెడ్డి, వాకిటి శ్రీహరి, తుడి మేఘారెడ్డి, పర్నికారెడ్డి, వీర్లపల్లి శంకర్, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ రఘునందన్‌‌రావు, కమిషనర్‌‌ గోపి, సివిల్‌‌ సప్లై కమిషనర్‌‌ డీఎస్‌‌ చౌహాన్, పాలమూరు కలెక్టర్‌‌ విజయేందిర బోయి పాల్గొన్నారు.