మీరే నాశనం చేసి..మీరే డెడ్​లైన్ పెడ్తరా?: ఉత్తమ్

మీరే నాశనం చేసి..మీరే డెడ్​లైన్ పెడ్తరా?: ఉత్తమ్
  • ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే కేటీఆర్​కే తెలివి ఎక్కువుందా?: ఉత్తమ్ 
  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గేట్లు ఓపెన్ పెట్టాలని ఎన్డీఎస్ఏ రిపోర్టు 
  • మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే, అది కూలిపోయే ప్రమాదం 
  • అదే జరిగితే భద్రాచలం సహా 44 ఊర్లు మునుగుతయ్
  •  కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నరని ఫైర్​

హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్లే నాశనం చేసి, ఇప్పుడు వాళ్లే డెడ్​లైన్ పెడుతున్నారని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను ఓపెన్ చేసి ఉంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పష్టంగా చెప్పిందని అన్నారు.

"మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే, అది కూలిపోతుందని హెచ్చరించింది. కానీ కేటీఆర్ మాత్రం మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసి, ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే కేటీఆర్ కే ఎక్కువ తెలివి ఉందా?” అని ఉత్తమ్​ ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ లోని జలసౌధలో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై పవర్​పాయింట్ ప్రజెంటేషన్​ ఇచ్చారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్​ కమీషన్ల కోసమే బీఆర్ఎస్​ నిర్మించింది. చేసిందంతా చేసి.. ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయాలని డెడ్ లైన్ పెడుతున్నారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి ఎక్కడ పోస్తారు? మూడు బ్యారేజీల గేట్లనూ తెరిచే ఉంచాలని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు నీటిని ఎక్కడికి ఎత్తిపోస్తారు?’’ అని ఉత్తమ్ నిలదీశారు. కేటీ ఆర్ ​చేసేవన్నీ పబ్లిసిటీ స్టంట్లు మాత్రమేనని, ఆయన తన పేరును ‘జోసెఫ్​గోబెల్స్’​గా మార్చుకుంటే బాగుం టుందని విమర్శించారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ కూలిపోతే బాగుండని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారేమో.. అందుకే నీళ్లు నిల్వ చేసి, ఎత్తిపోయాలని అంటున్నారు. కానీ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే, అది కూలిపోయి వరదంతా కింద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్దకు వెళ్తుంది. ఆ వరద తాకిడికి సమ్మక్కసాగర్​ కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. దాని ఎఫెక్ట్​ సీతరామసాగర్​పైనా పడుతుంది. ఫలితంగా 44 ఊర్లు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. భద్రాచలం పూర్తిగా మునిగిపోతుంది’’ అని చెప్పారు. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని, నిపుణులైన ఎన్డీఎస్​ఏ అధికారులు చెప్పినట్టే తాము చేస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును బాగు చేయడానికి కాంగ్రెస్​ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్డీఎస్​ఏ సిఫార్సుల ప్రకారమే ముందుకెళ్తామని, బ్యారేజీలకు మరింత డ్యామేజ్​జరగకుండా చూస్తామని తెలిపారు. 

కాళేశ్వరం కుంగడానికి కేసీఆరే కారణం

మేడిగడ్డ బ్యారేజీ కుంగితే 47 రోజుల పాటు కేసీఆర్​ ఒక్క మాట మాట్లాడలేదని ఉత్తమ్​ ఫైర్ అయ్యారు. ‘‘కేవలం కమీషన్లు వస్తాయన్న కక్కుర్తితోనే ప్రాజెక్టును కేసీఆర్ రీ డిజైనింగ్ చేశారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు. డీపీఆర్​లను పట్టించుకోకుండానే బ్యారేజీలను కట్టారు.   అన్నీ కేసీఆరే డిసైడ్​ చేసేశారు.  నచ్చినోళ్లకు కాంట్రాక్టులు ఇచ్చుకున్నారు. నిపుణుల సలహాలనూ పట్టించుకోలేదు” అని మండిపడ్డారు. 

కాళేశ్వరంతో ఆర్థిక విధ్వంసం

కేసీఆర్​కాళేశ్వరం కట్టి, రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేశారని ఉత్తమ్ మండిపడ్డారు. ‘‘దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత ఆర్థిక విధ్వంసం బీఆర్ఎస్​హయాంలో తెలంగాణలోనే జరిగింది. ఇంత ఆర్థిక విధ్వంసం సృష్టించిన ఏకైక సీఎం కూడా కేసీఆరే. ప్రాణహిత–చేవెళ్ల కట్టి ఉంటే రూ.38,500 కోట్లతో అయిపోయేది. కానీ రూ.94 వేల కోట్లతో కాళేశ్వరం కట్టి 93 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు. కాళేశ్వరం మూడో టీఎంసీని పూర్తి చేస్తే మొత్తం ఖర్చు రూ.1,47,427 కోట్లు అవుతాయని కాగ్​చెప్పింది. ప్రాణహిత ప్రాజెక్టుతో 16.4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. కానీ ఇంత ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆయకట్టు కేవలం 18.25 లక్షల ఎకరాలే. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా పంప్​చేస్తే కరెంట్ బిల్లులకయ్యే ఖర్చు కేవలం రూ.వెయ్యి కోట్లే. అదే కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.10,375 కోట్లు అవుతాయి” అని వివరించారు.

బాధ్యులపై చర్యలు తప్పవు

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడినోళ్లపై కఠిన చర్యలు తప్పవని ఉత్తమ్ హెచ్చరించారు. ‘‘ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారించేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్​ పీసీ ఘోష్​తో జ్యుడీషియల్​కమిషన్​ ఏర్పాటు చేశాం. కమిషన్ విచారణ పూర్తిస్థాయిలో జరుగుతున్నది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్​ ప్రాజెక్టును సందర్శించారు. అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులనూ విచారించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినోళ్లకు, తప్పు చేసినోళ్లకు శిక్ష తప్పదు. కమిషన్​రిపోర్ట్​ ఆధారంగా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. 

ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తం.. 

మేడిగడ్డ బ్యారేజీతో నీళ్లు ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడిందని, ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తామని ఉత్తమ్​తెలిపారు. ‘‘ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా వరద పెరుగుతున్నది. ప్రాజెక్టు నిండుతున్నది. ఒకట్రెండు రోజుల్లో అన్ని పంపులను స్టార్ట్​చేసి.. ఎల్ఎండీ, మల్లన్నసాగర్​, కొండపోచమ్మసాగర్ కు నీళ్లు పంపిస్తాం. హైదరాబాద్​తాగు నీటి అవసరాలకే వాటిని వినియోగిస్తాం” అని స్పష్టం చేశారు. 

కాళేశ్వరాన్ని పిక్నిక్​ స్పాట్​చేసిన్రు.. 

కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్​నేతలు పిక్నిక్​స్పాట్​గా మార్చారని ఉత్తమ్ విమర్శించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు బీఆర్ఎస్ నేతలు అందరినీ అక్కడికి తీసుకెళ్లి చూపించారు. కానీ పంప్​హౌస్​లు మునిగాక ఎవరినీ పోనివ్వలేదు. మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు కూడా ప్రతిపక్ష నేతలు వెళ్లకుండా అడ్డుకున్నారు. కానీ  మేం అలా కాదు. ఇప్పుడు అందరినీ వెళ్లనిస్తున్నాం. ఎవరైనా ఎన్నిసార్లైనా వెళ్లి చూసి రావొచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలాసార్లు అక్కడికి వెళ్లొచ్చారు. వాళ్లు చేయాల్సిన తప్పులన్నీ చేసి, ఇప్పుడు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు. ముందు వాళ్లు ప్రజలకు క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్​ చేశారు.