ఎస్ఎల్‌‌బీసీ టన్నెల్‌‌లోకి రోబోలు

ఎస్ఎల్‌‌బీసీ టన్నెల్‌‌లోకి రోబోలు
  • త్వరలో సీఎం నేతృత్వంలో రివ్యూ
  • సహాయక చర్యలు కొనసాగుతాయ్
  • మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి

ఎస్ఎల్​బీసీ నుంచి వెలుగు టీం : ఎస్ఎల్ బీసీ టన్నెల్​ రెస్క్యూ ఆపరేషన్‌‌లో రోబోలు పాల్గొంటాయని మంత్రి ఉత్తమ్​కుమార్‌‌రెడ్డి తెలిపారు. రాళ్లు, మట్టి, నీళ్లలో టీబీఎం శకలాలు కూరుకుపోవడంతో రెస్క్యూ సిబ్బంది ప్రమాదాల బారిన పడకుండా రూ.4 కోట్లు వెచ్చించి రోబోలను రంగంలోకి దింపుతున్నామన్నారు. రోబోలను వెంటనే రంగంలోకి దింపేందుకు అన్వి రోబోటిక్ నిపుణులతో చర్చించాలని ఆఫీసర్లను ఆదేశించారు. త్వరలో సీఎం రేవంత్‌‌రెడ్డి నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్‌‌లో పాల్గొంటున్న ఉన్నతాధికారులు, నిపుణులతో రివ్యూ మీటింగ్‌‌ నిర్వహిస్తామన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి శనివారం ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌ను సందర్శించి సహాయక చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెస్క్యూ బృందాలతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్ఎల్‌‌బీసీ టన్నెల్‌‌ ప్రమాదం జాతీయ విపత్తుగా పేర్కొన్నారు. 

కార్మికులను రక్షించడానికి చేపట్టిన సహాయక చర్యల్లో ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామన్నారు. కార్మికులను గుర్తించేందుకు15 రోజులుగా చేస్తున్న ప్రయత్నాలపై డిజాస్టర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ స్పెషల్‌‌ సెక్రటరీ అరవింద్‌‌కుమార్‌‌, ఆర్మీ కమాండెంట్‌‌ పరీక్షిత్‌‌ మెహ్రా మంత్రికి వివరించారు. ఎన్జీఆర్ఐ, జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, క్యాడవర్‌‌ డాగ్స్‌‌, ర్యాట్​హోల్‌‌ మైనర్స్, అన్వి రోబోటిక్‌‌ సర్వీసెస్​ బృందాలతో మంత్రి చర్చించారు. టన్నెల్​లో ఆక్సిజన్‌‌ సరైన స్థాయిలో  లేకపోవడం, నీటి ప్రవాహం పెరగడం, టీబీఎం పార్ట్స్,​ రాళ్లు, మట్టిలో కూరుకుపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు మంత్రికి వివరించారు. రెస్క్యూ ఆపరేషన్‌‌లో పని చేస్తున్న కార్మికులు, అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్ని నిధులు ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే 13వ కిలోమీటర్‌‌ నుంచి కన్వేయర్‌‌ బెల్ట్‌‌ పనిచేయడంతో రెస్క్యూ బృందాలకు కాస్త ఊరటనిస్తోంది.