వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉంది

  • ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న: ఉత్తమ్
  • పదవిపై ఆశ లేదు.. పదేండ్లు రేవంతే సీఎం: వెంకట్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్నారు. బుధవారం నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఉత్తమ్ మాట్లాడారు. ‘‘అభివృద్ధి విషయంలో కోమటిరెడ్డిని చూస్తే అసూయ కలుగుతున్నది.

నేను, కోమటిరెడ్డి ఎంపీలుగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేశాం. ఈ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌ ఒక్క సీటు కూడా గెలవదు. కేసీఆర్ హయాంలో ఎస్ఎల్​బీసీ టన్నెల్, డిండి, బీ వెల్లెంల ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. వీటితో పాటు పెండింగ్ ప్రాజెక్టులను మేం పూర్తి చేస్తాం. రైతుల నుంచి ప్రతి గింజను మద్దతు ధరకు కొంటాం. మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. కోడ్ ముగిశాక అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు. బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రుణమాఫీ, మద్దతు ధర, యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడంలో మోదీ సర్కారు విఫలమైందని మండిపడ్డారు.  

రుణమాఫీ చేస్తే డొక్కు కారును అమ్ముతరా?: వెంకట్ రెడ్డి 

తనకు సీఎం పదవిపై ఆశ లేదని, వచ్చే పదేండ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రేవంత్ నాయకత్వంలో మంత్రులమంతా టీమ్ వర్క్ చేస్తున్నామన్నారు. ‘‘నాపై అభిమానంతో ఉత్తమ్ మాట్లాడారు. పదవులపై ఆశ లేదు. ఇప్పుడున్న మంత్రి పదవి చాలు” అని అన్నారు . ‘‘రఘువీర్ రెడ్డి గెలుపు ఖరారైంది. మెజారిటీ కోసమే పని చేస్తున్నాం. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్​ ప్రజలను మోసగించారు. కమీషన్ల కోసం కాళేశ్వరాన్ని కట్టిండు. నక్కలగండి ద్వారా దేవరకొండ, మునుగోడు కు నీళ్లివ్వలేదు. జిల్లాను పట్టించుకోని కేసీఆర్.. నేడు ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడ వస్తున్నాడు. ఇక్కడికి రావడానికి సిగ్గుండాలి” అని మండిపడ్డారు.

‘‘దోచుకున్న డబ్బుతో జగదీశ్​రెడ్డి సూర్యాపేటలో గెలిచాడు. తన టీవీ చానెల్​ఎవరూ చూడరని వేరే చానల్​లో కేసీఆర్​ మాట్లాడారు. కవిత జైల్లో ఉన్నా కేసీఆర్ తీరు మారడం లేదు. శ్రీకాంతాచారి సాక్షిగా చెబుతున్నా.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు రెండు సీట్లు వచ్చినా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను” అని సవాల్ విసిరారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేయకపోతే తాను రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటానని, లేదంటే డొక్కు కారును అమ్ముకుంటారా? అని ప్రశ్నించారు. ‘‘మెదక్​లో కూడా కాంగ్రెస్సే గెలుస్తుంది. ర్యాలీలో మాజీ మంత్రులు జానారెడ్డి, రామిరెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, నేనావత్ బాలునాయక్, సీపీఐ నేత పల్లా వెంకట్​రెడ్డి, సీపీఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్​రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

గుత్తా ఇంటికి రఘువీర్​రెడ్డి

నల్గొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్​రెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. బుధవారం నల్గొండలోని గుత్తా ఇంటికి వచ్చిన రఘువీర్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కొడుకు గుత్తా అమిత్ రెడ్డిని కలిశారు. ఇటీవల సుఖేందర్​ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్, జగదీశ్​ రెడ్డిపై విమర్శలు చేశారు.