- చెరువులను కబ్జా చేస్తే ఊరుకోం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
- రుణమాఫీకి మరింత ఖర్చు చేస్తం మంత్రి పొంగులేటి
యాదాద్రి, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టును నమ్ముకొని ముందుకు వెళ్లే పరిస్థితి లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ‘గత ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, మెయింటెన్స్ పూర్తిగా లోపాలతో కూడుకొని ఉంది. ఈ ప్రాజెక్టుపై అయోమయం, అనిశ్చితి నెలకొంది. మేడిగడ్డ కూలిపోవడం అత్యంత బాధాకరం. సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంది’ అని అన్నారు. కాళేశ్వరంపై నమ్మకం లేకనే యాదాద్రి జిల్లాలో నిర్మించ తలపెట్టిన గంధమల్ల రిజర్వాయర్‌ను 1.4 టీఎంసీలకు తగ్గించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న గంధమల్ల రిజర్వాయర్, బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలపై శుక్రవారం భువనగిరిలో రివ్యూ మీటింగ్జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ చెరువులు, కుంటలను కబ్జా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎఫ్టీఎల్, శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు ఉన్న ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెక్ డ్యాంలను పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామన్నారు. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బునాదిగాని కాల్వకు రూ.269 కోట్లు, పిల్లాయిపల్లి కాల్వకు రూ.86 కోట్లు, ధర్మారెడ్డి కాల్వకు రూ.133 కోట్లు అవసరమని తెలిపారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అనాలోచితంగా రూ. 1.81లక్షల కోట్లు ఖర్చు చేసినా ఆయకట్టు పెంచలేకపోయిందన్నారు.
అపర భగీరథుడు ఉత్తమ్-: ప్రభుత్వ విప్ బీర్ల
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అపర భగీరథుడని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య అన్నారు. గంధమల్ల, బునాదిగాని కాలువ, దేవాదుల, తపాస్ పల్లి, నవాబ్‌పేట రిజర్వాయర్లు కాల్వలు త్వరగా పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయాలని కోరారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా ఇంకా 20 చెరువులు నింపే అవకాశం ఉందని, ఆ పనులు చేపట్టాలన్నారు. యాదగిరిగుట్ట గండి చెరువుకు కూడా నీరు ఇవ్వాలని కోరారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాగునీటి కాల్వల సామర్థ్యం పెరిగే విధంగా చూడాలని కోరారు. భూసేకరణ జరిగితేనే ప్రాజెక్టులు ఫలిస్తాయని, అందుకోసం భూసేకరణకు శాసనసభ్యులంతా కృషి చేయాలని కోరారు.
ఉత్తమ్ సీఎం అవుతారు : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. గమనించిన రాజగోపాల్ రెడ్డి 'ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎప్పడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు. నా నాలుకపై నల్లటి పుట్టుమచ్చ ఉంది. నేను అన్న మాటలు నిజమవుతాయని అంటారు' అని కామెంట్ చేశారు. మంచి మనసున్న వారికి మంచి పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. కాగా, నకిరేకల్ఎమ్మెల్యే వేముల వీరేశంకు చేదు అనుభవం ఎదురైంది. భువనగిరిలో నిర్వహించిన ఇరిగేషన్ రివ్యూకు వస్తున్న మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డికి స్వాగతం పలకడానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి హెలీప్యాడ్ వద్దకు ఎమ్మెల్యే వీరేశం వెళ్లారు.
ALSO READ : సింగరేణిలో 2,364 మంది వర్కర్ల రెగ్యులరైజ్
అందరూ లోనికి వెళ్తుండగా పోలీసులు వీరేశంకు చేతి అడ్డం పెట్టారు. దీంతో ఆయన వెనుదిరిగారు. విప్ ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వీరేశం అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులకు ఎవరు ఏంటో కూడా తెలియకుండా పోయిందని కామెంట్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు జెండగే, డీసీపీ రాజేశ్ చంద్ర, మున్సిపల్ చైర్మన్పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ రూ.500 కోట్లు ఎక్కువే చేస్తం: మంత్రి పొంగులేటి
రుణమాఫీ కచ్చితంగా పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపారు. మిగిలిన రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని, అవసరమైతే మరో రూ.500 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. 2026 మార్చి నాటికి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి సోనియా గాంధీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోస్తామని, రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు.