అర్హులందరికీ రుణమాఫీ చేస్తం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

అర్హులందరికీ రుణమాఫీ చేస్తం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • రైతులెవరూ ఆందోళన చెందొద్దు: మంత్రి ఉత్తమ్ 

కోదాడ, వెలుగు: ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంకా రుణమాఫీ కానీ రైతులెవరైనా ఉంటే, ఆందోళన చెందవద్దని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ మాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు శనివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల రైతులకు సమావేశం నిర్వహించారు. ఇందులో ఉత్తమ్ పాల్గొని మాట్లాడారు. రుణమాఫీ కాని రైతులు ఏఈవోలను కలవాలని సూచించారు.

 ఇందుకోసం రైతు వేదికల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. ‘‘రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశాం. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే... ఆ ఎక్కువ ఉన్నది రైతులు కట్టిన వెంటనే, రూ.2 లక్షలను ప్రభుత్వం చెల్లిస్తుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. రైతులు ఎవరూ అధైర్యపడవద్దు” అని భరోసా ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియా వారియర్స్ రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. 

ఏఈవోలను కలవండి: కలెక్టర్ 

రుణమాఫీ కాని రైతులు ఏఈవోలను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. రైతులు ఆధార్ కార్డు నెంబర్ చెప్పితే, సంబంధిత లోన్ వివరాలను అధికారులు తెలియజేస్తారని చెప్పారు. అవసరమైతే ప్రింట్ కూడా ఇస్తారని తెలిపారు. ‘‘కొందరి రైతులు  వివరాలు తప్పుగా నమోదయ్యాయి. అలాంటి వారికి మాఫీ కాలేదు. ప్రస్తుతం అలాంటి వాటిని సరిచేసుకోవచ్చు. 

ఆధార్ కార్డు నెంబర్లు తప్పు ఉన్నా, ఆధార్ కార్డులో, పాస్ బుక్ లో పేర్లు తప్పుగా నమోదైనా మాఫీ కాదు. ఇలాంటి సమస్యలతో మాఫీ కానోళ్లు.. తమ వివరాలను సరి చేసుకుంటే మాఫీ వర్తింపజేస్తాం. రేషన్ కార్డు లేనోళ్లు వ్యవసాయ అధికారులను కలిస్తే.. వాళ్లు నేరుగా రైతు ఇంటికి వచ్చి, కుటుంబసభ్యుల ఆధార్ కార్డు వివరాలు తీసుకుని లోన్ మాఫీ చేస్తారు” అని వెల్లడించారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.