- సన్నాలకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..
- మూసీ ప్రక్షాళనతో ఆయకట్టు పెంపు
మునగాల/కోదాడ, వెలుగు : కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోయినా, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు పనిచేయకపోయినా రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 40 లక్షల మంది రైతులు 66.7 లక్షల ఎకరాల్లో పంట సాగు చేసి 153 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే అరుదైన రికార్డ్ నెలకొల్పారన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు రోడ్ల పనులకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఫేజ్ 2తో వచ్చిన నీటినే కాళేశ్వరం జలాలు అంటూ గత ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు తెల్లరేషన్ కార్డు అందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించామని, ఇందుకోసమే సన్నాల సాగు పెంచేందుకు రూ. 500 ఇస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు రైతులకు రూ. 251.88 కోట్ల బోనస్ అందజేశామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, తాము 10 నెలల్లోనే 11వేల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు నెలకొల్పుతున్నట్లు చెప్పారు.
మూసీ నది పునరుజ్జీవం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇస్తామన్నారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ నందలాల్ పవార్, ఆఫీసర్లు పాల్గొన్నారు.