- ఎంపీ ఎన్నికల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి
- ఒక్క ఎంపీ సీటు కూడా గులాబీ పార్టీకి రాదు.. ఆ పార్టీ అడ్రస్ గల్లంతే
- కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడ్తది
- భారీ మెజార్టీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా
సూర్యాపేట/హుజూర్‌నగర్, వెలుగు: బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుండడంతో కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ‘‘బీఆర్‌ఎస్‌కు చెందిన గల్లీ స్థాయి లీడర్ నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కాంగ్రెస్‌లో చేరుతుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరుతారంటూ కేసీఆర్ మాట్లాడటం పెద్ద జోక్. లోక్‌సభ ఎన్నికల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌లో చేరుతారు” అని ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన నల్గొండ లోక్‌సభ సెగ్మెంట్ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు.
పదేండ్లు అవినీతి పాలనతో రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారని ఉత్తమ్ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా బీఆర్‌ఎస్ గెలవదని, ఎన్నికల అనంతరం ఆ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 60 ఏండ్ల కింద కట్టిన నాగార్జునసాగర్ ఇప్పటికీ రైతులకు నీళ్లు ఇస్తుంటే, లక్ష కోట్లు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగేండ్లకే కుప్ప కూలిందని తెలిపారు. సాగు, తాగునీరు, విద్యుత్ విషయంలో కేసీఆర్, జగదీశ్‌రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని ఆయన సూచించారు. వచ్చే10 ఏండ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో టీమ్‌గా, సమర్థవంతంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
మళ్లీ బీజేపీ గెలిస్తే ప్రమాదంలో రాజ్యాంగం
కేంద్రంలో మరోసారి బీజేపీ గెలిస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీల గొంతును బీజేపీ నొక్కుతున్నదని మండిపడ్డారు. భారతదేశం దిశ, దశను నిర్ణయించే పార్లమెంట్ ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్రంలో ఇండియా కూటమి అత్యధిక మెజారిటీతో గెలిచి జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ తీరు వల్లే కరువు పరిస్థితులు: కూనంనేని
కృష్ణా జలాలను ఆంధ్ర పాలకులకు కేసీఆర్ తాకట్టు పెట్టారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ వల్ల కరువొచ్చిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని సీపీఐ పొలిట్ బ్యూరో సభ్యుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. కేసీఆర్ ముందుచూపులేని పాలన వల్లే తెలంగాణలో కరువు పరిస్థితులు వచ్చాయని ఆయన అన్నారు. కేసీఆర్‌కు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నట్లు స్వర్గంలో విహరిస్తున్నారని దుయ్యబట్టారు.
కమ్యూనిస్టులను మోసం చేసిన బీఆర్ఎస్ను అథపాతాళానికి తొక్కుతామని హెచ్చరించారు. మళ్లీ అధికారం కోసం మతం పేరుతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మోదీ చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమావేశంలో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి , నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, సీపీఐ నాయకులు గన్నా చంద్ర శేఖర్, బెజవాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా, మటంపల్లి మండల ఎంపీపీ పార్వతి కొండనాయక్ , హుజూర్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్లు మంత్రి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.