కృష్ణా జలాలపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలకు మాట్లాడే హక్కు లేదు : మంత్రి ఉత్తమ్

కృష్ణా జలాలపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలకు  మాట్లాడే హక్కు లేదు : మంత్రి ఉత్తమ్
  • గత ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం: మంత్రి ఉత్తమ్
  • కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకూ పదేండ్లలో నీళ్లివ్వలే 
  • ఫలితంగా 100 టీఎంసీల సామర్థ్యాన్ని కోల్పోయినం
  • వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ కూడా చేయలేదని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్లే కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి మండిపడ్డారు. నాటి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన ఆ పార్టీ నాయకులకు కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు లేదని శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో  కాంగ్రెస్ సర్కారు హయాంలో మంజూరైన ప్రాజెక్టులను పదేండ్ల పాలనలో గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 

తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి 1.81 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చినా కృష్ణా జలాల విషయంలో అన్యాయం చేసింది గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వమే. వారి హయాంలో కృష్ణా బేసిన్​లో ఉన్న ఏ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. నిధులూ కేటాయించలేదు. దీంతో  దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్ లు 100 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయాయి. 

ఎస్ఎల్బీసీతో నిండే రిజర్వాయర్స్ కెపాసిటీ 10 టీఎంసీలు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రిజర్వాయర్స్ కెపాసిటీ 25 టీఎంసీలు, పాలమూరు –రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిజర్వాయర్స్ కెపాసిటీ 65 టీఎంసీలు. ఈ మూడు ప్రాజెక్టులే కాకుండా కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌లోని వివిధ దశల్లో  ఉన్న ఇతర ప్రాజెక్టులకు గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కారు హయాంలో నిధులు కేటాయించకుండా పూర్తి నిర్లక్ష్యం వహించారు. కరువు పరిస్థితులను తెచ్చారు" అని మండిపడ్డారు. 

భూసేకరణ కూడా చేయలే

పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో వివిధ ప్రాజెక్టులకు కనీసం భూసేకరణ కూడా చేయలేదని మంత్రి ఉత్తమ్ ఫైర్​ అయ్యారు. ఆ కారణంతోనే ప్రాజెక్టులు ముందుకు కదల్లేదని చెప్పారు. ‘‘కృష్ణా బేసిన్ లోని కొన్ని ప్రాజెక్టుల్లో కాలువలు, డిస్ట్రిబ్యూటరీలూ అసంపూర్తిగా ఉండడానికి కారణం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్సే.  కృష్ణా బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడానికి కారణం మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కాదా? సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మూడేండ్లలో కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తుంది’’  అని తెలిపారు.