- జిల్లా కేంద్రాలలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలె: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘన త ముమ్మాటికి సోనియాగాంధీదే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అటువంటి రాష్ట్రం ఏర్పా టు ప్రకటన చేసిన డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియెట్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఏటా డిసెంబర్ 9న వేడుకలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు గుర్తుండి పోయేలా చెప్పాలని సూచించారు. 2004 కరీంనగర్ సభలో ఇచ్చిన మాట ప్రకారం రాజకీయంగా ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటులో తాను క్రీయాశీలక పాత్ర పోషించానని, ఇది ఆత్మ సంతృప్తినిచ్చిందని గుర్తుచేశారు.
అమ్మమ్మ, నాయినమ్మ గుర్తొచ్చారు: దామోదర
“తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసినప్పుడు మా నాయనమ్మ, మా అమ్మమ్మలు గుర్తొచ్చారు” అని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. అసెంబ్లీలో సీఎం ప్రకటనపై ఆయన మాట్లాడారు. పట్టుదలకు, తెగింపునకు ప్రతిరూపం ఉస్మానియా, కాకతీయ వర్సిటీలని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటులో కవులు, కళాకారుల పాత్ర మరవలేనిదని వెల్లడించారు.