ఇయ్యాల మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్

ఇయ్యాల మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్

 

  • తొలుత సుందిళ్ల, అన్నారం పరిశీలన.. అటు నుంచి మేడిగడ్డకు
  • ఎన్​డీఎస్​ఏ సూచించిన పనుల పురోగతిపై సమీక్ష
  • హైదరాబాద్​కు చేరుకున్న జస్టిస్​ ఘోష్​
  •  నేడు అన్నారం బ్యారేజీ పరిశీలన.. సోమవారం నుంచి విచారణ

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం రిపేర్లపై ప్రభుత్వం ఫోకస్​ పెంచింది. వర్షాకాలం వస్తుండడంతో వీలైనంత త్వరగా నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) సూచనల మేరకు రిపేర్​ పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా శుక్రవారం ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈఎన్​సీలు అనిల్​ కుమార్, నాగేందర్ రావు, ఇరిగేషన్ అధికారులు ఆయన వెంట వెళ్లనున్నారు. బ్యారేజీల నిర్మాణాలను చేపట్టిన ఎల్​అండ్​ టీ, నవయుగ, ఆఫ్కాన్స్​ సంస్థల ప్రతినిధులూ మంత్రితోపాటే ఉండనున్నారు. బ్యారేజీల వద్ద జరుగుతున్న పనుల పురోగతిని మంత్రి ఉత్తమ్, అధికారుల బృందం పరిశీలించనుంది. ఇప్పటికే వర్షాలు పడుతున్న నేపథ్యంలో పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో ఉత్తమ్​పరిశీలించనున్నారు. పర్యటనలో భాగంగా ఉత్తమ్​ తొలుత ఉదయం సుందిళ్ల బ్యారేజీ వద్దకు వెళ్లనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నారం చేరుకుని అక్కడ పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డకు వెళ్లి పనుల పురోగతిపై సమీక్షిస్తారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్​ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.

జస్టిస్​ ఘోష్​ రాక

కాళేశ్వరం జుడీషియల్ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్​ గురువారం హైదరాబాద్​కు వచ్చారు. సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్​ చేరుకున్న ఆయనకు.. తాజ్​కృష్ణలో బస ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్​జీవన్​ పాటిల్, ఇరిగేషన్​ అధికారులతో సమావేశం అయ్యారు. 7న అన్నారం, 8న సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి సోమవారం విచారణను ప్రారంభించనున్నారు. కాగా, ఈ దఫా విచారణ సీరియస్​గానే సాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి దాదాపు పది రోజుల పాటు బ్యారేజీల నిర్మాణంలో భాగమైన వారందరినీ పిలిపించి జస్టిస్​ ఘోష్​ విచారణ చేస్తారని చెప్తున్నారు.