
- వచ్చే ఏడాది డిసెంబర్‍లోగా దేవాదుల ప్రాజెక్టు పూర్తి
- బీఆర్‍ఎస్ ప్రభుత్వం తీరు వల్లే పనులు కాలేదని వెల్లడి
వరంగల్/హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది డిసెంబర్‍లోగా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‍కుమార్‍రెడ్డి తెలిపారు. బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డితో కలిసి ఆయన జిల్లాలో పర్యటించారు. హనుమకొండ జిల్లా దేవన్నపేట గ్రామ సమీపంలోని దేవాదుల ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద మోటార్ స్విచ్ ఆన్ చేసి గోదావరి నది జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు రెండున్నర దశాబ్దాలుగా పూర్తి కాలేదన్నారు. దేవన్నపేట వద్ద ఉన్న మూడు పంపుల్లో ఒకటి ఆన్ చేసి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు చెప్పారు.
రెండో పంపును రాబోయే 15 రోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాజవరంలో పంపింగ్ స్టేషన్ పనులను కూడా పూర్తి చేస్తామన్నారు. బీఆర్‍ఎస్ తీరు వల్లే దేవాదుల పనులు ఇంత కాలం ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. దేవాదులతో పాటు ఉమ్మడి మహబూబ్‍నగర్ వంటి జిల్లాల్లో నిలిచిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి ఆయకట్టుకు నీళ్లు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేలా నీటిపారుదల శాఖ పాలసీ ఉంటుందన్నారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఇందిరమ్మ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. గడిచిన 10 ఏండ్ల పాలనలో బీఆర్‍ఎస్ ప్రబుద్ధులు ఏంచేశారో అందరికి తెలుసన్నారు. ఇన్నాళ్లు జరిగిన నష్టాన్ని రాబోయే రోజుల్లో పునరావృతం కాకుండా దేవాదుల పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామన్నారు. కార్యక్రమంలో స్టేషన్ ఘన్‍పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినీరెడ్డి, కేఆర్.నాగరాజు, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.