- రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు
- అక్రమాలకు పాల్పడితే డీలర్షిప్ రద్దు
- హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీల్లో పెట్టే ఫుడ్‌లోనూ క్వాలిటీ పాటించాలి
- ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే సహించేది లేదని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జనవరి నెల నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం సెక్రటేరియెట్‌లో ఆ శాఖ రాష్ట్రస్థాయి విజిలెన్స్ సమావేశం జరిగింది.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సివిల్ సప్లయ్స్సెక్రటరీ డీఎస్ చౌహాన్‌తో పాటు హెల్త్, ఎడ్యుకేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్, విజిలెన్స్ ఎన్ ఫోర్స్మెంట్ తదితర ఎనిమిది శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రేషన్‌బియ్యం పక్కదారి పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బియ్యం పట్టుబడిన వెంటనే రేషన్ డీలర్ షిప్ రద్దు చేస్తామన్నారు.
Also Read:-రాజీవ్ స్వగృహ’ వేలంపై సర్కార్ ఫోకస్
రేషన్ డీలర్ల కమిషన్ పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని.. కానీ, అక్రమాలను మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న1,629 రేషన్ షాపులకు కొత్తగా డీలర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ హాస్టల్స్‌తో పాటు అంగన్ వాడీ సెంటర్లు, స్కూళ్లలో పెడ్తున్న ఫుడ్‌లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. హాస్టల్స్‌ను, స్కూళ్లను, అంగన్వాడీ సెంటర్లను తరచూ తనిఖీలు చేస్తే.. వారిలో మార్పు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా వంటగ్యాస్ కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.