హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్‌లో ఎలాంటి గందరగోళం లేదని.. అర్హులందరికి రేషన్ కార్డులు అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డులపై ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నామని వెల్లడించారు.
Also Read : నో డౌట్.. అర్హులందరికీ రేషన్ కార్డులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో 40 వేల రేషన్ కార్డులే ఇచ్చిందని విమర్శించారు. అలాగే.. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం ఇస్తామని.. దీని ద్వారా ప్రభుత్వంపై రూ.11 వేల కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. కృష్ణా నది జలాల పంపకాల విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వాదన అర్థరహితమని మండిపడ్డారు. కృష్ణా వాటర్‌పై హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే- అని గుర్తు చేశారు.