హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల జారీపై నెలకొన్న గందరగోళంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు రేషన్ కార్డుల జారీపై సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తామని.. లిస్ట్‌లో పేరు లేకపోతే ఆందోళన చెందొద్దని సూచించారు. గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని.. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. కులగణన ఆధారంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేస్తున్నామని తెలిపారు. అలాగే.. ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డులు తీయడం ఉండదని క్లారిటీ ఇచ్చారు. పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను చేరుస్తామని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. కులగణన సర్వేలో ఉన్న వివరాలను ప్రాతిపదికగా తీసుకుని కొత్త రేషన్‌కార్డులకు అర్హులను ఎంపిక చేయడం, ఎలాంటి క్రాస్‌చెక్ చేయకుండా గ్రామ పంచాయతీల్లో ముసాయిదా లిస్టులను ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ లిస్టుల్లో తమ పేర్లు లేకపోవడంతో ఆయాచోట్ల అర్హులు ఆందోళనకు దిగారు. పలుచోట్ల ఇప్పటికే కార్డులు ఉన్నోళ్ల పేర్లు మళ్లీ జాబితాల్లో దర్శనమిచ్చాయి. అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు, వ్యాపారులు, సంపన్నులు, 7 ఎకరాలకు పైగా భూమి ఉన్న వారి పేర్లు కూడా లిస్టుల్లో కనిపించాయి.
అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్‌కార్డు లేని వారి పేర్లు జాబితాల్లో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం.. ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీల వద్దకు క్యూ కట్టారు. కొన్నిచోట్ల అధికారులను నిలదీయడమేగాక, సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డులు లేనోళ్లు వందకుపైగా ఉంటే, గ్రామ పంచాయతీల్లో పెట్టిన లిస్టుల్లో 50 మంది కూడా లేరు. అందులో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ల పేర్లు ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు కాకుండా అసలు ఊళ్లోనే లేని కుటుంబాలు, పక్క జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో నివాసముండే వారి పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.