ఎస్ఎల్బీసీ టన్నెల్‎లో ప్రమాదానికి కారణం ఏంటి.. అసలేం జరిగింది..?

ఎస్ఎల్బీసీ టన్నెల్‎లో ప్రమాదానికి కారణం ఏంటి.. అసలేం జరిగింది..?
  •  10 మందికిపైగా కూలీలకు గాయాలు 
  •  22 మంది సేఫ్.. 8 మంది మిస్సింగ్ 
  •  3 మీటర్ల వరకు కుంగిన పై కప్పు
  •  రిటైనింగ్ వాల్ కడుతుండగా ఘటన
  •  కొనసాగుతున్న సహాయక చర్యలు
  •  నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఘటన
  •  ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నాగర్ కర్నూల్/హైదరాబాద్: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో టన్నెల్ రిటైనింగ్ వాల్ కడుతుండగా 14వ కిలో మీటర్ వద్ద 3 మీటర్ల మేర కుంగిపోయింది. ఇవాళ ఉదయం సొరంగ మార్గం వద్ద సుమారు మూడు మీటర్ల మేర పై కప్పు కుంగింది. రిటైనింగ్ వాల్ కూలి టన్నెల్‌లో రింగులు విరిగిపడడంతో.. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. 

మరో ఏడుగురి ఆచూకీ తెలియడం లేదని బాధిత కార్మికులు తెలిపారు. ఆ సమయంలో సొరంగంలో యాభై మంది వరకు ఉన్నారంటున్నారు. వారిని బయటికి రప్పించేందుకు అధికారులు హుటాహుటిన సహాయ చర్యలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా ప్రమాదం విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన దోమల పెంట బయల్దేరి వెళ్లారు. మంత్రి జూపల్లి కూడా సంఘటనా స్థలానికి వెళ్లారు. ఐదేండ్ల సుదీర్ఘ విరామం తతర్వాత ఈ మధ్య ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభమయ్యాయి. 

టన్నెల్ లోపలికి నీళ్లొచ్చాయి: మంత్రి ఉత్తమ్

టన్నెల్ లోపలికి నీళ్లొచ్చాయని తెలుస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉందన్నారు. ‘ఇంకా ఎవరైనా టన్నెల్ లో చిక్కుకు పోయారా అనేది తెలియడం లేదు. కాంట్రాక్టర్ కు  సంబంధించిన కార్మికులు కొందరు లోపలే ఉన్నట్టు చెబుతున్నారు.’ పూర్తి సమాచారం రావాల్సి ఉందని చెప్పారు. 

సహాయక చర్యలు చేపట్టండి: సీఎం

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఎస్ఎల్బీసీ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్. ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.

ఎన్‌డీఎస్‌ఏ స్పందించాలే: కవిత

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పైకప్పు కూలి కూలీలు గాయపడటం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్‌ హయాంలో పది కి.మీల మేర టన్నెల్‌ తవ్వారు. ఏ ఒక్క రోజూ ఇలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు రోజుల కిందటే పనులు మొదలుపెట్టిందన్నారు. ఈ ప్రమాదానికి బాధ్యులెవరని ప్రశ్నించారు.  నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఈ ప్రమాదంపై స్పందించాలని అన్నారు.  ఇంకా 9 కి.మీ.లకు పైగా టన్నెల్‌ తవ్వాల్సి ఉందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని  పేర్కొన్నారు.