హైదరాబాద్, వెలుగు: వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదిక సిద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. గురువారం సీఎం రేవంత్‌కు నివేదిక అందజేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 26న కేబినెట్ భేటీ జరుగుతుందని, అందులో నివేదికపై చర్చిస్తామన్నారు. మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా ప్రతినిధులతో బుధవారం సివిల్ సప్లయ్స్ భవన్లో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. ‘‘సిఫార్సులతో కూడిన తుది నివేదికపై కేబినెట్ భేటీలో చర్చించి ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకుంటాం. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ.. ధాన్యం కొనుగోళ్లపై బ్యాంకు గ్యారంటీతో పాటు మిల్లింగ్ చార్జీలు పెంచడం వంటి అంశాలపై పలు సిఫార్సులతో నివేదిక రూపొందించింది. మధ్యాహ్న భోజన పథకం, హాస్టల్స్, ఐసీడీఎస్ పథకాల కింద పంపిణీ చేయడానికి సంబంధించిన సన్న బియ్యంపై 10శాతం పగిలిన బియ్యం ఖర్చులను పెంచడంపై అధ్యయనం చేసింది. మిల్లర్లతో పలుమార్లు సమావేశమై నివేదిక రూపొందించింది’’అని ఉత్తమ్ తెలిపారు.
బోనస్ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే..
రాష్ట్రంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 146.70 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ‘‘80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 30 లక్షల టన్నుల దొడ్డు, 50 లక్షల టన్నుల సన్న రకం ధాన్యం సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈ సీజన్ నుంచే సన్న రకం ధాన్యంపై క్వింటాల్‌కు అదనంగా ఇచ్చే రూ.500 బోనస్.. నేరుగా రైతుల ఖాతాల్లోనే పడ్తాయి. ఈ మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఈ కుబేర్ ప్లాట్‌ఫామ్ ద్వారా జమ చేసే ఏర్పాట్లు చేశాం’’అని ఉత్తమ్ వివరించారు.
ఈ యేడు 7,248 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా.. ఇప్పటికే 2,539 సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. ‘‘అక్టోబర్ 22 నాటికి 230 మంది రైతుల నుంచి రూ.3.34 కోట్ల విలువైన 1,440 టన్నుల ధాన్యం కొన్నాం. ఈ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తాం’’అని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, లక్ష్మీ కాంతారావు, సివిల్ సప్లయ్స్ కమిషనర్ డీఎస్ చౌహాన్, డైరెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.