ప్రతిపక్షాలు నిలదీస్తే గానీ, పేదల గురించి ప్రభుత్వం ఆలోచించదా’ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన కామెంట్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి, సన్నబియ్యం ఇవ్వబోతున్నామని తెలిపారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలు నమ్మ వద్దని, ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అర్హత ఉండి పొందలేని వారు మళ్లీ గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ALSO READ | ప్రతిపక్షం నిలదీస్తేనే ప్రభుత్వానికి సోయి ఉంటదా?: హరీశ్
సూర్యాపేటజిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయలేదన్నారు. కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత అందరికీ మంచి క్వాలిటీ సన్నబియ్యం అందిస్తామని అన్నారు. జాన్ పహాడ్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఎత్తి పోతల పథకానికి భూమి పరిశీలన పూర్తయిందని, నూతనంగా ఏర్పాటు చేయబోయే లిఫ్ట్ కు జవహర్ లాల్ నెహ్రూ నామకరణం చేస్తున్నామని చెప్పారు.