ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై తాము అలర్ట్‌గా ఉన్నామని, దాన్ని కచ్చితంగా అడ్డుకుంటామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆపాలని, అనుమతులు ఇవ్వొద్దని, నిధులు కేటాయించవద్దని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్పాటిల్ తో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ పంపించామని వెల్లడించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు.
70 శాతం వాటాకు ఎందుకు పోరాడలేదు?
తెలంగాణ రాకముందు శ్రీశైలం నుంచి ఏపీ రోజూ 4.1 టీఎంసీ నీళ్లు తీసుకెళ్తే, తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్హయాంలో అది 9.6 టీఎంసీలకు పెరిగిందని ఉత్తమ్తెలిపారు. ‘‘2020 ఆగస్టు 10న రాయలసీమ ప్రాజెక్ట్ టెండర్ఫిక్స్ అయింది. వాస్తవానికి జులైలో అపెక్స్కౌన్సిల్మీటింగ్ఉన్నా.. ఆగస్టు తర్వాత పెట్టాలంటూ నాటి ఇరిగేషన్సెక్రటరీ కేంద్రానికి లేఖ రాశారు. కారణం అప్పటికల్లా రాయలసీమ టెండర్లు పూర్తవుతాయని నాటి సర్కార్ భావించింది. ఇన్‌డైరెక్ట్‌గా రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించేందుకే నాటి సర్కార్ చప్పుడు చేయలేదు. ఏపీతో నాటి సర్కార్ కుమ్మక్కయిందనడానికి ఇదే నిదర్శనం.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో బీఆర్ఎస్సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వాళ్లు సరిగా స్పందించి నిధులు ఇచ్చి ఉంటే ప్రాజెక్టు పూర్తయి ఉండేది. రెండో అపెక్స్కౌన్సిల్మీటింగ్కు అప్పటి సీఎంలు కేసీఆర్, జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్షెకావత్హాజరయ్యారు. ఆ మీటింగ్‌లోనూ ఏపీ, తెలంగాణకు 66:34 శాతం వాటాకు ఓకే చెప్పారు. అప్పుడే దీనిపై బీఆర్ఎస్వాళ్లు ఎందుకు పోరాడలేదు. రాష్ట్రానికి 70 శాతం వాటా ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదు’’ అని ప్రశ్నించారు.