SLBC టన్నెల్ వద్ద అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష

SLBC టన్నెల్ వద్ద అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష

ఎస్ఎల్‏బీసీ టన్నెల్ దగ్గర ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఉన్నారు. రెస్య్కూ ఆపరేషన్ తాజా పరిస్థితులపై అధికారులను మంత్రి ఉత్తమ్ ఆరా తీశారు. సహయక చర్యల్లో ఎదురవుతోన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సహయక చర్యల కోసం వీలైన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. 

మరోవైపు.. ఎస్ఎల్‏బీసీ టన్నెల్ వద్ద సహయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. టన్నెల్‎లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు అధికారులు రెస్య్కూ అపరేషన్ కొనసాగిస్తున్నారు. టన్నెల్‎ ప్రమాద స్థలిలో పెద్ద ఎత్తున నీరు, బురద పేరుకుపోవడంతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ రెస్య్కూ బృందాలు దాదాపు ఘటన స్థలం దగ్గర వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

మరికొన్ని మీటర్ల దూరం వెళ్లాల్సి ఉంది. టన్నెల్‎లో 15 అడుగుల మేర బురద నీరు పేరుకుపోవడంతో ఆ  నీటిని బయటకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే.. ప్రమాదంలో ధ్వంసమైన కన్వేయర్ బెల్ట్‎ను పునరుద్ధరించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. టన్నెల్‎లో రెస్య్కూ ఆపరేషన్‎కు సవాల్‎గా మారిన టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) భాగాలను గ్యాస్ కట్టర్ల సహయంతో కట్ చేసి తొలగించనున్నారు. ప్రమాద స్థలి నుంచి టీబీఎంను తప్పిస్తే సహయక చర్యల్లో కీలక పురోగతి సాధించినట్లేనని అధికారులు తెలిపారు.