- బీజేపీ హయాంలో పార్లమెంట్ వ్యవస్థ నాశనం
- విభజన హామీలు అమలు చేయని ఆ పార్టీకి రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదు
- ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు
- మీట్ ది ప్రెస్‌లో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు : పదేండ్ల బీజేపీ పాలనలో మోదీ ప్రభుత్వం పార్లమెంట్ వ్యవస్థను నాశనం చేసిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దేశ చరిత్రలో అతి తక్కువ రోజులు పార్లమెంట్ సెషన్ జరిగింది ఈ ప్రభుత్వంలోనేనన్నారు.అత్యధికంగా 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం కూడా ఇదే తొలిసారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో మంత్రి ఉత్తమ్ పాల్గొని మాట్లాడారు. “మరోసారి మోదీ ప్రధాని అయితే పాకిస్తాన్, రష్యా, నార్త్ కొరియాలాగా దేశం తయారవుతుంది. డెమోక్రసీ ఉండదు. ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్‌ల సహకారంతో ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నరు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. రాష్ట్రంలో కేంద్రం ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఎన్నికల ప్రచారంలో మోదీ దిగజారి మాట్లాడుతున్నారు. దేశాన్ని ఎలా విభజించాలో ఆలోచిస్తున్నారు. గత పదేండ్లుగా విభజన హామీలు అమలు చేయని బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదు”అని ఉత్తమ్ పేర్కొన్నారు.
ఎన్నికలయ్యాక బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్సే..
ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్సేనన్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖలను కేసీఆర్ నాశనం చేసిండని ఆరోపించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను సరైన పద్ధతిలో కట్టలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన తప్పుకు కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా ఉచిత సలహాలు ఇస్తున్నారని, ఆయన సలహాలు తమకేం అక్కర్లేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో నిపుణుల సలహాల మేరకు ముందుకెళ్తామని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం బీజేపీ వాళ్లకు అలవాటని, కానీ తెలంగాణలో వాళ్ల ఆటలు సాగవని హెచ్చరించారు. తమ ప్రభుత్వాన్ని తాము కాపాడుకుంటామని, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులంతా క్రికెట్ టీమ్‌లాగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఇండియా కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు. 5 లక్షల మెజారిటీతో నల్గొండలో గెలుస్తామని, భువనగిరిలో కూడా భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రుణమాఫీ, రైతు బంధు హామీలను అమలు చేస్తామని, ఆర్థిక వనరులు పెంచడానికి ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఐదేండ్లలో పాలమూరు జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల తర్వాత అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి వెల్లడించారు.