ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకోండి..కృష్ణా నదిపై టెలిమెట్రీలు పెట్టండి : మంత్రి ఉత్తమ్

ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకోండి..కృష్ణా నదిపై టెలిమెట్రీలు పెట్టండి : మంత్రి ఉత్తమ్
  • పాలమూరు, సీతారామ, సమ్మక్కసాగర్​కు అనుమతులివ్వండి  
  • ఎన్డీఎస్ఏ తుది నివేదికను త్వరగా ఇవ్వండి.. కేంద్రమంత్రి సీఆర్​ పాటిల్​తో భేటీలో డిమాండ్ 
  • జీరో వడ్డీతో 50 ఏండ్ల లోన్లు ఇస్తామని కేంద్రం హామీ 
  • త్వరలోనే సీతారామకు అనుమతులు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్​ ఇస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి కోరారు. రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​లో జరుగుతున్న ఆలిండియా స్టేట్​వాటర్​మినిస్టర్స్​కాన్ఫరెన్స్​ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్​పాటిల్, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో ఉత్తమ్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ జలదోపిడీతో పాటు రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతులు, మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక తదితర అంశాలపై చర్చించారు. ‘‘కృష్ణా నదీ జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నది. 

శ్రీశైలం, నాగార్జునసాగర్​ప్రాజెక్టుల నుంచి అక్రమంగా నీటిని తోడుకుంటున్నది. దీంతో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నది. ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలంటే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల వద్ద 35 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలి. అప్పుడు ఏ రాష్ట్రం ఎంత నీటిని వాడుకుంటున్నదో రియల్​టైమ్ డేటా ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుంది. తద్వారా ఎవరికి కేటాయించిన కోటాను వాళ్లు వినియోగించుకునే అవకాశం ఉంటుంది” అని ఉత్తమ్ అన్నారు. ఆయన చేసిన డిమాండ్లకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. అక్రమ నీటి వినియోగాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

ప్రాజెక్టులకు అనుమతులివ్వండి..

రాష్ట్రంలో చేపడుతున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రి సీఆర్​పాటిల్​ను మంత్రి ఉత్తమ్ కోరారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామసాగర్, సమ్మక్క సాగర్​ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తిగా కేంద్రమే నిధులివ్వాలని డిమాండ్​చేశారు. 

అయితే రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులకు జీరో వడ్డీతో 50 ఏండ్ల పేమెంట్ ఆప్షన్​తో రుణ సదుపాయం కల్పిస్తామని కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టుకు నెలలో అనుమతులన్నీ ఇస్తామని తెలిపారు. మూసీ పునరుజ్జీవ పథకానికి కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని ఉత్తమ్​కోరగా.. కేంద్రం ఇలాంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తుందని, తెలంగాణ ప్రతిపాదనలపై ఆలోచించి నిర్ణయం చెబుతామని సీఆర్​పాటిల్​పేర్కొన్నారు. 

ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇవ్వండి..

మేడిగడ్డ బ్యారేజీపై తుది నివేదిక ఇవ్వడంలో నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆలస్యం చేస్తోందని, దాదాపు ఏడాది కాలంగా సాగదీస్తోందని కేంద్రమంత్రి దృష్టికి ఉత్తమ్​తీసుకెళ్లారు. రిపోర్టును త్వరగా ఇచ్చి బ్యారేజీకి చేపట్టాల్సిన రక్షణ చర్యలపై సిఫార్సులు చేస్తే దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. నదీ జలాల వివాదంపై కృష్ణా ట్రిబ్యునల్​లో వాదనలు త్వరగా పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని, తెలంగాణకు అన్యాయం జరగకుండా తీర్పు వచ్చేలా చూడాలని కోరారు. 

దీనిపై స్పందించిన సీఆర్ పాటిల్.. ‘‘ఈ నెలాఖరులోపు ఎన్డీఎస్ఏ రిపోర్టును రాష్ట్రానికి సమర్పిస్తాం. ట్రిబ్యునల్​లో వాదనలు త్వరగా పూర్తయ్యేలా చూస్తాం. అంతేకాకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్​ప్రాజెక్టుల రిపేర్లకు సంబంధించి ప్రపంచ బ్యాంకు సహకారంతో చేపడుతున్న డ్యామ్​రీహాబిలిటేషన్​అండ్​ఇంప్రూవ్ మెంట్​ప్రాజెక్ట్ (డ్రిప్) కింద నిధులు ఇస్తాం.. వాటిని వాడుకోండి. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పూడికతీతకూ డ్రిప్​ఫండ్స్​ను వాడుకోండి” అని సూచించారు.