‘బనకచర్ల’పై అభ్యంతరం చెప్పినం.. ఏపీ ఎలాంటి డీపీఆర్​ ఇవ్వలేదని కేంద్ర మంత్రి చెప్పారు: మంత్రి ఉత్తమ్​

‘బనకచర్ల’పై అభ్యంతరం చెప్పినం.. ఏపీ ఎలాంటి డీపీఆర్​ ఇవ్వలేదని కేంద్ర మంత్రి చెప్పారు: మంత్రి ఉత్తమ్​
  • తెలంగాణ నీళ్ల విషయంలో ఏపీకి అడ్డుకట్ట వేయాలని కోరాం
  • ఐదు ప్రాజెక్టులకు నిధులివ్వాలని రిక్వెస్ట్​ చేశాం
  • మేడిగడ్డపై ఎన్డీఎస్​ఏ రిపోర్ట్​ త్వరగా ఇవ్వాలని అడిగాం
  • తెలంగాణ నీటి వాటాలపై కేంద్ర మంత్రి ఎదుట బలంగా వాదించామని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి–- బనకచర్ల లింక్ ప్రాజెక్టు కు ఏపీ చేసిన ప్రతిపాదనలపై తాము గట్టిగా అభ్యంతరం తెలిపామని రాష్ట్ర ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి తెలిపారు. అయితే.. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అసలు తమకు ఫిజిబిలిటీ, డీపీఆర్, ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర జల్​శక్తి మంత్రి సీఆర్​పాటిల్​ చెప్పారన్నారు. అలాగే, బనకచర్ల ప్రాజెక్ట్ పై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారని చెప్పారు. తమ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఆయన మాటిచ్చారని వెల్లడించారు.  

సోమవారం ఢిల్లీలో కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రి సీఆర్​ పాటిల్  తో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉత్తమ్​కుమార్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. కృష్ణా నది జలాల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని అన్నారు. కృష్ణా జలాల కేటాయింపుల్లో  రాష్ట్రానికి, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రమంత్రి ఎదుట తాను,  సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా వాదించినట్లు చెప్పారు. 

వాటాకు మించి ఏపీ ఎక్కువ నీళ్లు తీసుకెళ్తున్నదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని  అడ్డుకట్టు వేయాలని డిమాండ్ చేశామన్నారు. తెలంగాణకు సంబంధించిన అనేక ముఖ్యమైన నీటి పారుదల అంశాలపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో చర్చించినట్లు చెప్పారు. 

ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరాం

కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్–-2లో 811 టీఎంసీల్లో తెలంగాణకే ఎక్కువ నీటిని కేటాయించాలని, ఆ దిశగా కేడబ్ల్యూటీ–-2కు ఆదేశాలివ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు మంత్రి ఉత్తమ్​ చెప్పారు. పాలమూరు–-రంగారెడ్డి, సీతారామ సాగర్, సమ్మక్క- సారక్క ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు త్వరగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ విషయంలో వేగవంతంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు. 

అలాగే పాలమూరు–-రంగారెడ్డి, సీతారామ సాగర్, మోదికుంటవాగు, చిన్న కాళేశ్వరం, కొరాటా చనాఖా.. ఈ 5 ప్రాజెక్ట్ లకు ఏబీఏపీ లేదా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఫండింగ్ కింద నిధులివ్వాలని కోరామన్నారు. కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు ఇతర పాయింట్లలో టెలీమెట్రీ పరికరాలను వెంటనే ఇన్ స్టాల్ చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు చెప్పారు. వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చులో అవసరమైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇద్దరి వాటాను తామే భరిస్తామని వెల్లడించినట్టు తెలిపారు. 

అలాగే,  మేడిగడ్డతోపాటు ఇతర రెండు బ్యారేజీల కొలాప్స్ పై ఎన్డీఎస్ఏ(నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) విచారణ జరుపుతున్నదని, దీనికి సంబంధించిన నివేదికను తమకు త్వరగా ఇవ్వాలని కోరామన్నారు.  ఆ రిపోర్టు ఆధారంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఉత్తమ్​ చెప్పారు.