తీరు మార్చుకోకపోతే కౌశిక్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తీరు మార్చుకోకపోతే కౌశిక్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే.. రాజకీయ భవిష్యత్ ఉండదని అన్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి సమావేశంలో కౌశిక్ రెడ్డి తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మంత్రిగా తాను స్టేజి మీద ఉండగానే అల్లరి చేయడం లీడర్ లక్షణం కాదని అన్నారు. యువ రాజకీయ నాయకుడైన కౌశిక్ రెడ్డికి అంత ఆవేశం పనికి రాదని అన్నారు ఉత్తమ్.

కౌశిక్ రెడ్డితో తనకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని.. కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే భవిష్యత్ లో ఇబ్బంది పడతారని అన్నారు. కాగా.. పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ గ్రామసభలో బూతు పురాణంతో రెచ్చిపోయారు. దీనిని చూసిన గ్రామస్తులు.. అధికారులు నివ్వెర పోయారు.ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ గ్రామసభలో తిట్ల పురాణాన్ని మొదలు పెట్టారు. గ్రామసభలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే .. తాను ప్రజా ప్రతినిథిని అని మరిచి... అక్కడ సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి తిట్టారు.

ఏం బతుకులు రా మీవి అంటూ  కొన్ని బూతు పదాలు ఉపయోగించారు.  ఇలా మాట్లాడుతుండగా స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.  దీంతో సహనం కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు..నకిలీ నాయకులంటూ ఫైర్ అయ్యారు.ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు  ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే  ప్రవర్తించిన తీరు పట్ల స్థానికులు విస్మయం చెందారు.