- ఎస్సారెస్పీ కింద 9.68 లక్షల ఎకరాలకు అందాలి
- తాగునీటి అవసరాల కోసం నీటి నిల్వలను మెయింటెయిన్ చేయాలి
- కాల్వల నిర్వహణను మెరుగుపరచాలని అధికారులకు ఆదేశం
- ఎల్ఎండీ ఎగువ, దిగువన వారబందీ పద్ధతిలో నీళ్లిస్తున్నామన్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: యాసంగిలో ఆయకట్టు చివరి పంట భూములకూ నీళ్లిచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం సరిపడా నీటి నిల్వలను మెయింటెయిన్ చేయాలని సూచించారు. శుక్రవారం జలసౌధలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదలపై అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.
నీటి సరఫరాకు సంబంధించి కాకతీయ ప్రధాన కాలువ, సరస్వతీ కాలువ, లక్ష్మీ కాలువ, చౌటపల్లి హన్మంత రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పారు. మొత్తం 9.68 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి రైతుకు సమానంగా నీరందాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. కాలువలను మెరుగ్గా నిర్వహించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు కాలువల్లో మొలిచిన పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించి నీటి ప్రవాహానికి అడ్డులేకుండా చూడాలన్నారు. నీటి కేటాయింపుల్లో తాగునీటి అవసరాలు, వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నీటి కేటాయింపులకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. యాసంగిలో ఎక్కువ దిగుబడి వచ్చేలా ప్రతి ఎకరాకూ, చివరి ఆయకట్టు వరకూ నీళ్లిచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు.
వారబందీ ద్వారా నీళ్లిస్తున్నం
చివరి ఆయకట్టు వరకు నీళ్లందించేందుకు వారబందీ (ఆన్/ఆఫ్) పద్ధతిని ఫాలో అవుతున్నామని మంత్రి ఉత్తమ్‌కు అధికారులు వివరించారు. లోయర్ మానేరుకు ఎగువన జోన్ –1కు ఏడు రోజులు ఆన్, ఏడు రోజులు ఆఫ్, జోన్2కు 8 రోజులు ఆన్, 7 రోజులు ఆఫ్ ప్రాతిపదికన నీళ్లిస్తున్నామని తెలిపారు. నిరుడు డిసెంబర్ 25 నుంచే నీళ్లను విడుదల చేస్తున్నామని, ఏప్రిల్ 8 వరకు కొనసాగిస్తామని చెప్పారు. లోయర్ మానేర్‌కు దిగువన జోన్–1 కు గురువారం నుంచి, జోన్– 2కు ఈ నెల 1 నుంచే వారబందీ పద్ధతిని ప్రారంభించామని, మార్చి 31 వరకు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
నీటి లభ్యతను బట్టి నీటిని బ్యాలెన్సింగ్‌గా విడుదల చేస్తున్నామని చెప్పారు. లోయర్ మానేరుకు ఎగువన 77.76 టీఎంసీలు, దిగువన 49.89 టీఎంసీలు అవసరమవుతాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎల్ఎండీ కింద మొత్తంగా 9.04 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నదని తెలిపారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 80.50 టీఎంసీల జలాలున్నాయని, ఆ నీళ్లు ఎల్ఎండీకి ఎగువన ఆయకట్టుకు సరిపోతాయని చెప్పారు.
ఇంజినీర్లు డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉండొద్దు
ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు డ్యూటీలో అలసత్వం చూపించొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ వారసత్వం గొప్పదని, దానిని కొనసాగించాలని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ డైరీని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. లక్ష్య సాధనలో ఇంజినీర్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
క్రమశిక్షణ, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. హైదరాబాద్ విలీనానికి ముందే నిజాం పాలనలో ఏర్పడిన అసోసియేషన్‌కు తగిన గౌరవం, గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.