డిసెంబర్​ నాటికి ‘పాలమూరు’ పూర్తి: ఉత్తమ్

డిసెంబర్​ నాటికి ‘పాలమూరు’ పూర్తి: ఉత్తమ్
  • అన్ని రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీటి నిల్వ
  • సెక్రటేరియెట్​లో ఉన్నత అధికారులతో మంత్రి రివ్యూ

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది చివరి నాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్​ నాటికి రిజర్వాయర్లన్నింటినీ పూర్తి చేసి నీటిని నిల్వ చేసి పంటలకు నీళ్లివ్వాలని నిర్ణయించింది. శనివారం ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి.. ఆ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్​ దాస్, శాఖ ఉన్నతాధికారులతో సెక్రటేరియెట్​లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని ఫేజ్​1 పనులను ప్రాధాన్యపరంగా చేపట్టాలని, డిసెంబర్​ నాటికి ఆ పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. కరివెన రిజర్వాయర్​ వరకు పెండింగ్​ ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్యాకేజీ 3లో భాగంగా నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య కాల్వ పనులను వెంటనే ప్రారంభించాలని, అక్టోబర్​లోపు ఆ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 

నార్లాపూర్​(6.4 టీఎంసీలు), ఏదుల (6.55), వట్టెం (16.70 టీఎంసీలు), కరివెన (19 టీఎంసీలు) రిజర్వాయర్ల పనులను టైమ్​కు పూర్తి చేయాలని, డిసెంబర్​ నాటికి ఆయా రిజర్వాయర్లలో వాటి పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 50 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ఆదేశాలిచ్చారు. మరోవైపు నార్లాపూర్, ఏదుల, వట్టెం పంపింగ్​ స్టేషన్లకు 400 కేవీ సబ్​స్టేషన్ల నిర్మాణానికిగానూ ట్రాన్స్​కోకు రూ.262 కోట్ల నిధులను మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు.

జులై నాటికి పంప్​హౌస్​లలో షెడ్యూల్​ చేసిన మోటార్ల డ్రైరన్​ను పూర్తి చేయాలన్నారు. కాగా, జూరాల ప్రాజెక్టును మునుపటి పూర్తి స్థాయి సామర్థ్యానికి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు. పూడిక తీసి ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి సామర్థ్యం అయిన 12 టీఎంసీలకు పునరుద్ధరించాలన్నారు.