- వెంటనే టెండర్లు పిలవండి.. వరద నష్టంపై రిపోర్టు ఇవ్వండి
- రెగ్యులేటర్లు, షెట్టర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు మంత్రి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తెగిన చెరువు కట్టల పునరుద్ధరణకు వెంటనే షార్ట్ టెండర్లు పిలవాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పాలనాపరమైన అనుమతులు త్వరగా పూర్తి చేసి, ఆన్ లైన్ లో అప్ డేట్ చేయాలని ఆయన సూచించారు. పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియను తక్షణమే చేపట్టాలని చెప్పారు. గురువారం హైదరాబాద్లోని జలసౌధ నుంచి నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లతో ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జరిగిన వరద నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ‘‘రిజర్వాయర్లలో ప్రమాద సంకేతాలు గుర్తిస్తే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. అన్ని షెట్టర్లు, రెగ్యులేటర్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రాజెక్టులతో పాటు రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
జలాశయాల సామర్థ్యం మేరకు వాటిలో నీళ్లు నింపాలి. అధికారులు మరింత అప్రమత్తతో ముందుకెళ్లాలి” అని సూచించారు. వరదల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించారు. సమావేశంలో ప్రత్యేక కార్యదర్శులు రాహుల్ బొజ్జా, ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరిరాం, శంకర్, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సాగర్ ఎడమ కాలువ రిపేర్లకు 21 కోట్లు..
ఇటీవల కురిసిన వర్షానికి సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం రామచంద్రాపురం గ్రామ సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ దెబ్బతిన్నతి. దీని పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు నీటిపారుదల శాఖ రూ.21 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.