ఇది ప్రోగ్రెసివ్ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ.. పటిష్టమవుతుంది: ఉత్తమ్

ఇది ప్రోగ్రెసివ్ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ.. పటిష్టమవుతుంది: ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంతసాహసోపేతమైన, ప్రోగ్రెసివ్ బడ్జెట్ అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచి వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందించేలా బడ్జెట్ కు రూపకల్పన జరిగిందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సుస్థిరాభివృద్ధి, ఆహార భద్రత వంటి వాటికి పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బడ్జెట్​ను ప్రవేశపెట్టామన్నారు. 

ఇరిగేషన్, సివిల్ సప్లైస్ శాఖలకు కేటాయించిన బడ్జెట్​తో దీర్ఘకాలిక వృద్ధి నమోదవుతుందని, తద్వారా రైతులు బలోపేతమై గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ఆర్థికంగా వెనుకబడిన వారు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖకు కేటాయించిన రూ.23,373 కోట్ల బడ్జెట్​తో పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వీలవుతుందన్నారు. దాంతో పాటు రైతులకు నిరంతరాయంగా నీటిని సరఫరా చేసేలా కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. 

ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో 6.7 టీఎంసీల నీటిని లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని107 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీటిని అందించవచ్చన్నారు. మూసీ ప్రాజెక్ట్ కింద బునాదిగాని కెనాల్ పునరుజ్జీవం కోసం రూ.266 కోట్ల కేటాయించారని, దీనితో యాదాద్రి జిల్లా రైతులకు నీళ్లు అందుతాయన్నారు.