పాలమూరు ప్యాకేజీ 3కి కొత్త అంచనాలు వాస్తవాలకు తగ్గట్టుగా రూపొందించండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు 
  • ఉమ్మడి మహబూబ్​నగర్ ప్రాజెక్టులపై మంత్రి జూపల్లితో కలిసి సమీక్ష
  • సింగోటం–గోపాలదిన్నె కెనాల్​కు జూపల్లి పట్టు 
  • రేలంపాడు సీపేజీల రిపేర్లకు నిర్ణయం!

హైదరాబాద్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు చేపట్టే కెనాల్ (ప్యాకేజీ 3) పనులకు ఫ్రెష్​గా ఎస్టిమేట్స్ తయారు చేయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కొత్తగా ఎస్టిమేట్స్​ను సిద్ధం చేసి శాంక్షన్ కోసం ప్రభుత్వానికి పంపాలని చెప్పారు. ప్యాకేజీ 3కి సంబంధించి తొలుత రూ.628 కోట్లతో అంచనాలను తయారు చేయగా.. పెరిగిన వ్యయ అంచనాలతో ఎస్టిమేట్స్ ను అధికారులు రూ.784 కోట్లకు పెంచారు. దీనిని ఆమోదం కోసం పంపగా ప్రభుత్వం తిరస్కరించింది.

తిరిగి రూ.728 కోట్లకు అంచనాలను సిద్ధం చేయగా.. తాజాగా మరోసారి వాస్తవాలకు దగ్గరగా ఉండేలా ఎస్టిమేట్స్​ను సిద్ధం చేసి పంపాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించినట్టు తెలిసింది. కొత్త అంచనాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం ప్రాజెక్టు ఖర్చుపై నిర్ణయం తీసుకుందామన్నారు. బుధవారం జలసౌధలో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై ఆ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణా రావుతో కలిసి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.

నిజామాబాద్​జిల్లా ప్రాజెక్టులపై రివ్యూ చేయాల్సి ఉన్నా దానిని వాయిదా వేశారు. పాలమూరు ప్రాజెక్టులో ప్యాకేజీ 3తో పాటు అన్ని డిస్ట్రిబ్యూటరీ నెట్​వర్క్స్ పనులనూ వేగవంతం చేయాలన్నారు. దానిపై చర్చించి టెండర్లను పిలవాలని సూచించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​నూ పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు కోరగా.. ముందు కింది రిజర్వాయర్లను పూర్తి చేసుకుందామని ఉత్తమ్ సూచించారు. లక్ష్మీదేవిపల్లికి ముందు దాని కింద ఉన్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్ రిజర్వాయర్ల పనులను స్పీడప్ చేయాలని ఆదేశించారు.  ఉద్ధండాపూర్ తో పాటు వివిధ చోట్ల భూసేకరణ పరిహార సమస్యలపైనా సమావేశంలో చర్చించారని, ఆ సమస్యలను కూడా పరిష్కరించాలని మంత్రి సూచించారని తెలిసింది.  

సింగోటంపై జూపల్లి పట్టు

సింగోటం నుంచి గోపాలదిన్నె రిజర్వాయర్ వరకు లింక్ కెనాల్ నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణా రావు పట్టుబట్టినట్టు తెలిసింది. అయితే, ఆ లింక్​ కెనాల్ అంచనా వ్యయం రూ.140 కోట్ల నుంచి రూ.240 కోట్లకు పెరిగిందని అధికారులు మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లగా.. అంచనా ఖర్చు పెరిగినా గ్రావిటీ ద్వారా నీళ్లొచ్చే కెనాల్​ను పూర్తి చేస్తే జూరాల, భీమా టెయిల్ ఎండ్​లోని 2 వేల ఎకరాలను స్థిరీకరించొచ్చని మంత్రి జూపల్లి వివరించినట్టు తెలిసింది. 

అయితే, ఈ లింక్ కెనాల్​కు 3 కిలోమీటర్ల మేర సొరంగాన్ని తవ్వాల్సి ఉంటుందని, జియోలాజికల్ స్ట్రాటజీపైనా చర్చించాల్సి ఉందని అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో పాటు భూసేకరణ పరిహారం సమస్య కూడా ఉందని చెబుతున్నారు. దీనిపై రిపోర్ట్ తయారు చేయాల్సిందిగా సీఈకి మంత్రి సూచించారు. నెట్టెంపాడు రిజర్వాయర్ ఆధారంగా నిర్మించిన గూడెందొడ్డి ప్రాజెక్టు సర్వే ఎస్టిమేట్స్​ను కూడా ప్రిపేర్​ చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించినట్టు తెలిసింది. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.31 కోట్లుగా ఇప్పటికే నిర్ధారించినట్టు సమాచారం. 

రేలంపాడుకు రిపేర్లు

రేలంపాడు రిజర్వాయర్​కు సీపేజీల సమస్య ఉండడంతో దానికి రిపేర్లు చేసేందుకు మంత్రి ఉత్తమ్ అనుమతిచ్చినట్టు తెలిసింది. అందుకు అనుగుణంగా సీఈ సీడీవో డిజైన్ల ఆధారంగా పనుల అంచనాలను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. సీపేజీల కారణంగా 2019 నుంచి రిజర్వాయర్​లో 2 టీఎంసీల నీటినే నిల్వ చేస్తున్నారు. 4 టీఎంసీల సామర్థ్యమున్నా ఇప్పటిదాకా ఫుల్ కెపాసిటీతో నీటిని నిల్వ చేయలేదు. దీంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లు అందుతలేవని ఎమ్మెల్యేలు ప్రస్తావించగా.. రిపేర్లు చేయడానికి మంత్రి ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. రేలంపాడుతో పాటు ఉమ్మడి జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ లిఫ్ట్​ స్కీమ్​లకూ రిపేర్ల అంశాన్ని పరిశీలించాలనీ  సూచించినట్టు సమాచారం.

అలాగే కల్వకుర్తి లిఫ్ట్, భీమా కెనాల్స్​లో పూడిక తీసేందుకు జీవో జారీ చేయాలని మంత్రి ఉత్తమ్​ను మంత్రి జూపల్లి కోరినట్టు తెలిసింది. దాంతో పాటు కల్వకుర్తి లిఫ్ట్​లోని బాచారం కెనాల్ నిర్మాణానికి కూడా శాంక్షన్ ఇవ్వాలని అడిగారు. తద్వారా ప్రాజెక్టు కింద మిగిలిపోయిన గ్రామాలైన యాపట్ల, మారెడ్డిదిన్నె, ముక్కిడిగుండం, మూలచింతలపల్లి గ్రామాలకూ నీటిని అందించవచ్చని  చెప్పారు. భీమా నుంచి శ్రీరంగాపూర్ వరకు రెండో లిఫ్ట్ నుంచి కెనాల్​ను వెడల్పు చేయాలని కూడా మంత్రి జూపల్లి కోరినట్టు తెలిసింది. శ్రీరంగాపూర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 2 టీఎంసీల నీటిని వాడుకుంటే 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చని చెప్పినట్టు సమాచారం. 

వారంలో సీతమ్మసాగర్ అప్రూవల్స్​ 

ఉమ్మడి మహబూబ్​నగర్ ప్రాజెక్టులతో పాటు పలు ఇంటర్​స్టేట్ వాటర్ ఇష్యూస్ మీద కూడా రివ్యూలో చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ అప్రూవల్స్​పై అధికారులతో మంత్రి ఉత్తమ్ చర్చించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పెట్టిన కొర్రీలపైనా చర్చ సమావేశంలో చర్చ జరిగింది. నీటి కేటాయింపులపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలను వీలైనంత త్వరగా క్లియర్ చేసుకునేందుకు కూడా ప్రయత్నించాలని మంత్రి సూచించినట్టు సమాచారం. ఇక సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు వారం పది రోజుల్లోనే క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందని తెలిసింది.