
- చెరువుల ద్వారా ఆదా చేసిన 45 టీఎంసీలపై రివ్యూ చేయండి: మంత్రి ఉత్తమ్
- మండలం క్లస్టర్‌గా తీసుకుని అధ్యయనం చేయాలని సూచన
- సమ్మక్క సాగర్ వరద, ముంపుపై సిమ్యులేషన్ స్టడీ చేయాలి
- నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ పటిష్ఠతపై ఎన్డీఎస్ఏతో అధ్యయనం చేయించండి
- అనంతరం కలెక్టర్లతో తాగునీటిపై సమీక్ష
- జులై వరకు ఎలాంటి ఇబ్బంది లేదన్న అధికారులు
- వర్షాలతో జూరాలకూ ప్రవాహం వస్తున్నదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో సర్కారు కసరత్తులను వేగవంతం చేస్తున్నది. మైనర్ ట్యాంకుల ద్వారా ఆదా చేసిన 45 టీఎంసీలను ప్రాజెక్టు కేటాయింపుల్లో మన అధికారులు చూపించగా.. సైంటిఫిక్‌గా లేవంటూ డీపీఆర్‌లను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ 45 టీఎంసీల నీటి లభ్యతపై మరోసారి స్టడీ చేయించాల్సిందిగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలిచ్చారు.
ఆ నీటి లభ్యతపై రివ్యూ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లా క్లస్టర్‌గా చెరువుల ద్వారా ఆదా అయిన నీటిని లెక్కల్లో చూపించగా.. మండలం క్లస్టర్‌గా దానిపై స్టడీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. శనివారం ఆయన జలసౌధలో అధికారులతో సమ్మక్కసాగర్, పాలమూరు రంగారెడ్డితదితర అంశాలపై రివ్యూ చేశారు. ఇటు సమ్మక్కసాగర్ ప్రాజెక్టు వరద, ముంపుపై చత్తీస్‌గఢ్ అభ్యంతరాల నేపథ్యంలో మరోసారి సిమ్యులేషన్ స్టడీ చేయించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
47 టీఎంసీల కేటాయింపులకు సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు రాకపోవడం, చత్తీస్‌గఢ్ ఎన్వోసీని జారీ చేయకపోవడం వంటి కారణాలతో సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించాలని ఉత్తమ్ సూచించారు. ఈ రెండు ప్రాజెక్టుల అనుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రివ్యూల తర్వాత కలెక్టర్లతోనూ డ్రింకింగ్ వాటర్‌పై మంత్రి ఉత్తమ్ రివ్యూ చేశారు.
ప్రస్తుతం ఎక్కడా ఎలాంటి సమస్యా లేదని, తాగునీటి సరఫరా సాఫీగా జరుగుతున్నదని అధికారులు మంత్రికి వివరించారు. జులై వరకు ఇబ్బందులు లేవన్నారు. జూరాలకు సంబంధించి గద్వాల కలెక్టర్ కొంత ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రాజెక్ట్ డెడ్‌స్టోరేజీకి చేరడంతో డ్రింకింగ్ వాటర్ సమస్య ఏర్పడే అవకాశం ఉందని చెప్పినట్టు తెలిసింది. అయితే, కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం జూరాలకు ఇన్‌ఫ్లో వస్తున్నదని, మున్ముందు డ్రింకింగ్ వాటర్‌కు సమస్యలు ఉండవని ఆయన వివరించారు.
సాగర్ భద్రతపైనా దృష్టి పెట్టండి
శ్రీశైలం డ్యామ్ ప్లంజ్‌పూల్‌లో భారీ గొయ్యి పడి చివరికి డ్యామ్‌కే ముప్పు ఏర్పడింది. దానికి రిపేర్లు చేయించాలని ఎన్నోసార్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) అధికారులు ఏపీకి సూచించినా పెడచెవిన పెట్టింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఏపీ అధికారులతో ఈ నెల 28న ఎన్డీఎస్ఏ అధికారులు సమావేశం కానున్నారు. అనంతరం ఈ నెల 30న జలసౌధలో మన అధికారులతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ప్రాజెక్టు ముప్పును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పటిష్ఠతపైనా దృష్టి సారించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు.
ఆ రెండు ప్రాజెక్టులను సందర్శించి వాటికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అన్న అంశంపై ఎన్డీఎస్ఏతోప్రాథమిక సర్వే చేయించాలని అధికారులకు సూచించారు. అందుకు ఎన్డీఎస్ఏకు లేఖ రాయాలని ఆదేశాలివ్వగా.. శనివారం సాయంత్రం ఎన్డీఎస్ఏకు ఈఎన్సీ అనిల్ కుమార్ లేఖ రాశారు. డ్యామ్‌ల పటిష్ఠతపై సర్వే చేయించాలని కోరారు. కాగా, ఇటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపైనా అధికారులతో ఈఎన్సీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువుల ద్వారా ఆదా చేసిన 45 టీఎంసీల నీటి లభ్యతపై మరోసారి స్టడీ చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.