హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణాన్ని సుమారు మూడు గంటల పాటు పరిశీలించారు. తెలంగాణ ప్రజల గుండెలకు హత్తుకునే నిర్మాణంగా నిలిచిపోనుందని.. అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు అత్యంత శ్రద్ధతో పనిచేయాలని మంత్రి సూచించారు.
మెయిన్ ఎంట్రన్స్,ల్యాండ్ స్కేప్ ఏరియా, వాటర్ ఫౌంటెన్, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ప్రాంతంలో పనులపై అధికారులకు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణంలో ఏర్పాటు చేసే మ్యూజియం, ఆడిటోరియం పై అంతస్తులో ఏర్పాటు చేసే రెస్టారెంట్ నిర్మాణాలు పరిశీలించి పలు సూచనలు చేశారు.
దుబాయ్ నుండి ప్రత్యేకంగా తెప్పించి అమరుస్తున్న అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్ షీట్స్ పనులను మంత్రి పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి షీట్స్ బిగింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నిర్మాణంలో నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. నిర్మాణ ప్రాంగణం అంతా పచ్చదనంతో, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పనుల పురోగతి రోజువారీగా పరిశీలిస్తానని మంత్రి వేముల చెప్పారు. ప్రభుత్వం విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్ అండ్ బీ అధికారులకు స్పష్టం చేశారు.