నిధులు పక్కదారి పట్టలేదు... అర్వింద్‌ అవగాహన లేకుండా మాట్లాడుతుండు

బాల్కొండలో కట్టిన ప్రతి బిడ్జిపై బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత కు కమీషన్ వెళ్తుందని బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్  చేసిన ఆరోపణలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఖండించారు. ఒకే పనికి డబుల్ బిల్డింగ్ చేస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని చెప్పారు.  ఎంపీ అర్వింద్ కు కనీస అవగాహన లేదని, తమపై ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు.  నిధులు పక్కదారి పట్టలేదని, ఆరోపణలపై సీబీఐతో విచారణ చేసుకోవచ్చునని అన్నారు.   

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ పెద్దవాగుపై నిర్మించిన హైలెవెల్‌ వంతెనకు  ఆర్‌డీసీ (రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) కింద రూ.15 కోట్లు డ్రా చేసిన తరువాత మళ్లీ స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఫండ్‌ ద్వారా నిధులు తీసుకున్నారని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపేణా వచ్చే నిధులతో సంబంధం లేకుండా కేంద్రం వడ్డీ లేకుండా 50 ఏళ్ల వరకు స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఫండ్‌ నుంచి రుణాలు మంజూరు చేస్తుందన్నారు.  ఈ క్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి వేముల ఖండించారు.