పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రూ.1.80 కోట్లతో నిర్మించిన రోడ్లు భవనాల (ఆర్ అండ్ బీ) అతిథి గృహాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.
కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన ఆర్.ఓ.బీ ప్రతిపాదనల్లో 4 మాత్రమే మంజూరు చేశామని , అందులో పెద్దపల్లికి చోటు దక్కిందని అన్నారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో ఆర్ అండ్ బీ శాఖ ద్వారా మొత్తం రూ.1,458 కోట్ల పనులు మంజూరు చేసుకున్నామని, రూ.680 కోట్ల ఖర్చు చేసి వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు, పూర్తి చేసిన సాగు నీటి ప్రాజెక్టుల ఫలితంగానే కోనసీమ ఉభయగోదావరి జిల్లాలకు ధీటుగా పెద్దపల్లి జిల్లాలో వరి సాగు పెరిగిందని మంత్రి వేముల తెలిపారు. 2014 లో పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో 98 వేల ఎకరాల్లో వరి సాగు జరిగితే.. ప్రస్తుతం 1.58 వేల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిబద్దతతో పనిచేయడం వల్లే ప్రస్తుతం తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.