హైదరాబాద్, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలకు రైతులు బలవుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. వర్షాల్లేక తీవ్ర బాధలో ఉన్న రైతులపై కూడా ఆ పార్టీ లీడర్లకు ప్రేమ లేదని విమర్శించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం నోటికాడి బుక్కను లాక్కోవడం సరికాదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఫైర్ అయ్యారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాలో రూపాయి లేకుండా ఆగం చేసి పోతే.. మేము రూపాయి రూపాయి కూడబెట్టి రైతుభరోసా వేస్తే.. బీజేపీ లీడర్లు అడ్డుకున్నరు.
చెప్పిన టైమ్‌కు మా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసింది. అకౌంట్లలో డబ్బులు పడ్తున్నాయని రైతులు సంతోషపడే లోపలే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిధులు ఆపేలా కుట్రలు చేయడం బాధాకరం’’అని మంత్రి అన్నారు. బీజేపీకి మొదటి నుంచీ రైతులంటే ప్రేమే లేదని, అందుకే నల్ల చట్టాలు తెచ్చి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేసిందని తెలిపారు. ఇప్పుడు బీజేపీ తన గుప్పిట్లో ఉన్న ఈసీని అడ్డం పెట్టుకొని బ్యాంకు ఖాతాలో పడ్డ రైతు భరోసా సొమ్ములను కూడా నిలిపి వేసిందని, ఇంత కంటే దారుణం ఎక్కడా ఉండదని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న కుట్రలను అన్నదాతలు అర్థం చేసుకున్నారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.