హరీశ్​రావు అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసిండు: మంత్రి వెంకట్ రెడ్డి

హరీశ్​రావు అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసిండు: మంత్రి వెంకట్ రెడ్డి
  • ఇండియా రావొద్దని చెప్పి వచ్చిండు: మంత్రి వెంకట్​రెడ్డి
  • ఫోన్ ట్యాపింగ్.. ప్రపంచంలోనే పెద్ద నీచమైన పని
  • ప్రభాకర్ రావుతోపాటు కేసీఆర్, కేటీఆర్​ జైలుకు పోవాల్సిందే 
  • ఉద్యమం పేరుతో కేసీఆర్​ వసూళ్లకు పాల్పడ్డడు
  • మంత్రి పదవి రాలేదనే కోపంతోనే ఉద్యమం మొదలుపెట్టిండు
  • సీఎం సీటు పోయిందని, బిడ్డ జైల్లో ఉందని ఇప్పుడు దుఖం వస్తున్నదని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో నిందితుడైన ఇంటెలిజెన్స్​ మాజీ చీఫ్​ ప్రభాకర్ రావును అమెరికా నుంచి ఇండియాకు రాకుండా అడ్డుకుంటున్నది కేసీఆరే అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. హరీశ్​రావు ఇటీవల అమెరికా వెళ్లి  ప్రభాకర్ రావును కలిశాడని, ఇండియాకు రావొద్దని చెప్పి వచ్చాడని అన్నారు. హరీశ్​రావు గత నెల 26న అమెరికా వెళ్లి.. శనివారం (జూన్​1) తిరిగి వచ్చాడని, తన దగ్గర ఆయన వెళ్లిన ఫ్లైట్ వివరాలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా కేసీఆర్ శతవిధాల ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో మంత్రి వెంకట్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభాకర్​రావు ఇండియాకు వస్తే కేసీఆర్​కుటుంబానికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. దేశ, ప్రపంచ చరిత్రలో.. రాబోయే కాలంలో మరెవ్వరూ చేయని నీచమైన పని ఫోన్ ట్యాపింగ్ అని పేర్కొన్నారు.  ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలాంటి రౌడీ గ్యాంగులను పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్​ అపహాస్యం చేసిండని మండిపడ్డారు. ప్రగతి భవన్, ఫౌంహౌజ్​లో కేసీఆర్  వ్యవసాయం చేసుకుంటుండనుకున్నం కానీ.. ఫోన్ ట్యాంపింగ్ లాంటి దుర్మార్గమైన పనిచేస్తుండని తెలియదని అన్నారు.  

ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడం కోసం నెల కింద సీబీఐకీ లేఖ కూడా రాసిందని, రెడ్ కార్నర్ నోటీసు రాగానే ఆయన తప్పకుండా ఇండియాకు రావాల్సిందేనని,  పోలీసులకు ఆ దుర్మార్గాలన్నీ చెప్పాల్సిందే అని తెలిపారు.  ప్రభాకర్ రావు, కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. కేసీఆర్ పెద్దరికంతో వ్యవహరించి.. ప్రభాకర్ రావును వచ్చి లొంగిపోవాలని చెప్పాల్సింది పోయి.. రావొద్దని చెప్పడం దారుణమని పేర్కొన్నారు. 

దోపిడీని అడ్డుకున్నం

తాము చేపపిల్లలు, గొర్రెల పంపిణీ స్కీమ్స్​ను అపహాస్యం చేశామని కేసీఆర్​ అబద్ధాలు మాట్లాడుతున్నాడని మంత్రి వెంకట్​రెడ్డి ఫైర్​అయ్యారు.  గొర్రెల పంపిణీ స్కీమ్​లో గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మాజీ ఎండీ రాంచందర్‌ నాయక్, అప్పటి మంత్రి ఓఎస్డీ కల్యాణ్​తో కలిసి మీరు దోచుకున్న 700 కోట్ల దోపిడీని తాము అడ్డుకున్నామని తెలిపారు. ప్రజల సొమ్ముకు కాపాలాదారులుగా ఉండటమే తమ విధానమని స్పష్టం చేశారు.

“ఇయ్యాల  కేసీఆర్ గంటన్నర ప్రెస్ మీట్ పెట్టి.. కాంగ్రెస్ పాలన చూస్తే దుఃఖం వచ్చేలా ఉందంటున్నడు. ఆయన మాటలు చూస్తే గమ్మతనిపిస్తుంది. ఎందుకు దుఃఖం వస్తది ఆయనకు..  సీఎం సీటు పోయిందనా? బిడ్డకు బెయిల్ వస్తలేదనా? కొడుకు, అల్లుడు ట్యాపింగ్ కేసులో ఇరుక్కుంటరనా? ఎందుకు దుఃఖం వస్తుందో చెప్పాలి’ అని వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. 

తెలంగాణపై కేసీఆర్​కు ఏనాడూ ప్రేమ లేదు

అధికారం పోయిందనే బాధ తప్ప తెలంగాణ మీద కేసీఆర్​కు ఏనాడూ ప్రేమ లేదని మంత్రి వెంకట్​రెడ్డి అన్నారు. తాను మొదలు పెట్టినంకనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యిందన్నట్టు కేసీఆర్​ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ‘‘1969 ఉద్యమకారులు ఓ నలుగురైదుగురు ఉండే అంటడు.. చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్​ జయశంకర్.. వీళ్లంతా ఆనాడు ఉద్యమం చేయలేదా? మేం 40 మంది ఎమ్మెల్యేలం ప్రణబ్ ముఖర్జీ కమిటీని కలిసి తెలంగాణ ఏర్పాటు చేయాలని ఉద్యమించినం.  

కేసీఆర్ మాత్రం ‘సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ అమాయకులను రెచ్చగొట్టి ప్రాణాలు తీసిండు. ఖమ్మం జిల్లాకు పోగానే దీక్ష విరమిస్తే ఉస్మానియా వర్సిటీ విద్యార్ధులు దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన్రు. దీంతో ఐవీ ఫ్లూయిడ్స్, ఉప్మాలు తినుకుంటూ నిమ్స్ హాస్పిటల్ లో నకిలీ దీక్ష చేసిన నకిలీ ఉద్యమకారుడు కేసీఆర్. మంత్రి పదవి రాలేదని ఉద్యమం పేరుతో చంద్రబాబును బ్లాక్ మొ యిల్ చేయాలనే ఉద్యమం మొదలు పెట్టిండు.. తప్ప తెలంగాణమీద ప్రేమ లేదు” అని పేర్కొన్నారు.

14 గంటలకు మించి కరెంట్ రాలే

బీఆర్ఎస్  హయాంలో రోజులో 14  గంటలకు మించి కరెంట్​ సరఫరా జరగలేదని, ఏ సబ్​స్టేషన్​లోనూ లాగ్ బుక్స్​ లేవని మంత్రి వెంకట్​రెడ్డి తెలిపారు. యాదాద్రి ప్లాంట్ లో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, కేసీఆర్ కలిసి  రూ.45 వేల కోట్ల పనులను నామినేషన్ మీద ఇచ్చారని, ఇద్దరు కలిసి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దీనిపై హైకోర్టు మాజీ చీఫ్​ జస్టిస్ నర్సింహారెడ్డి చైర్మన్ గా కమిషన్​ వేశామని, ఆ కమిషన్​ నివేదిక తర్వాత వీళ్ల దోపిడి బయటపడుతుందని చెప్పారు. ఆనాడు తాను ఎంపీగా ఉన్నప్పుడు లోక్ సభ కమిటీ మెంబర్ గా ప్రతిమ శ్రీనివాస్ రావు విద్యుత్ దోపిడీని ప్రధానితో మాట్లాడి అడ్డుకున్నానని తెలిపారు.  

ఎమ్మెల్సీ ఎన్నిక చాలా చిన్నది..

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక చాలా చిన్నదని మంత్రి వెంకట్​రెడ్డి అన్నారు. తాము బీఆర్ఎస్ పార్టీలాగా ప్రజాప్రతినిధులను సంతలో సరుకుల్లాగా కొనబోమని తెలిపారు. తమకు ప్రజాస్వామ్యం అంటే గౌరవమని అన్నారు.

ఉద్యమం పేరుతో వసూళ్లకు పాల్పడ్డడు

కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో లంచ్ కు లక్ష ప్రోగ్రాం పెట్టి వసూళ్లకు పాల్పడ్డాడని మంత్రి వెంకట్​రెడ్డి ఫైర్​ అయ్యారు. ఎలక్షన్, బై ఎలక్షన్, కలెక్షన్ విధానంలో సీమాంధ్ర వ్యాపారుల నుంచి కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు.  సోనియాగాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని అసెంబ్లీలో చెప్పిండని,  కుటుంబసభ్యులను తీసుకుపోయి సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్​.. ఇప్పుడు అదే తల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఉండరని, కేసీఆర్​ జైలుకు పోవడం ఖాయమని తెలిపారు.