బీఆర్ఎస్​ను కేసీఆరే బొంద పెట్టుకున్నడు : మంత్రి వెంకట్​రెడ్డి

బీఆర్ఎస్​ను కేసీఆరే బొంద పెట్టుకున్నడు : మంత్రి వెంకట్​రెడ్డి
  • అధికారంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిండు: మంత్రి వెంకట్​రెడ్డి

నల్గొండ, వెలుగు: ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ ఏడాదిగా ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్నడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆరే బొంద పెట్టుకుండని విమర్వించారు. శుక్రవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారంతా తన కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు. ‘‘కేసీఆర్.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. నీ తడాఖా ఏందో చూపిస్తా అంటున్నావుగా.. చూడడానికి మేము సిద్ధంగా ఉన్నం” అని అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని, సకలజనుల సమ్మెతో పాటు పార్లమెంటులో మేమంతా కొట్లాడినందుకు, శ్రీకాంత చారి లాంటి ఎంతోమంది ప్రాణత్యాగం చేయడంతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్ చేసినవన్నీ దొంగ దీక్షలని, 10 ఏండ్లు అధికారంలో ఉండి కూడా అందరినీ మోసం చేశారని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీ ఏడు లక్షల కోట్ల అప్పు చేస్తే వాటికి వడ్డీలు కట్టుకుంటు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా అమలు చేస్తుందని అన్నారు. మంత్రి వెంట భువనగిరి 
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.