ప్రోగ్రాంకు ఆలస్యంగా వచ్చిన మంత్రి .. ఎండలోనే స్టూడెంట్లు

  • ప్రోగ్రాంకు ఆలస్యంగా వచ్చిన మంత్రి 
  • మూడు గంటలకు పైగా అవస్థ పడ్డ చిన్నారులు

సూర్యాపేట, వెలుగు: క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి మంత్రి ఆలస్యంగా రావడంతో అప్పటివరకు స్టూడెంట్లను ఎండలోనే కూర్చోబెట్టారు. సూర్యాపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మూడు రోజులపాటు మంత్రి జగదీశ్ రెడ్డి పేరిట ప్రభుత్వ బడుల్లో జీజేఆర్ కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. చివరిరోజు అన్ని మండలాల నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో క్రీడలను ఏర్పాటు చేశారు. బుధవారం మంత్రి జగదీశ్ రెడ్డి చేతులమీదుగా పోటీలను ఉదయం 9 గంటలకు  ప్రారంభించాల్సి ఉంంది.

మంత్రి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు స్టూడెంట్లను ఆఫీసర్లు ఎండలోనే కూర్చోబెట్టారు. అనంతరం మంత్రి వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆఫీసర్లు మంత్రి జగదీశ్ రెడ్డిని  పొగడ్తలతో ముంచెత్తారు. ఎల్లప్పుడూ మంత్రి జగదీశ్ రెడ్డియే గెలుస్తాడంటూ స్టూడెంట్ల ముందు తెగ పొగిడేశారు. ఇటీవల జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ జయహో జగదీశ్​రెడ్డి అంటూ స్టూడెంట్లతో జై కొట్టించారు. ఇప్పుడు విద్యాశాఖ ఆఫీసర్లు సైతం మంత్రి మెప్పు కోసం ఎండలో గంటలకొద్దీ కూర్చోబెట్టడమే కాకుండా స్టూడెంట్ల ముందే ఇలా పొగడడమేంటని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.