50 సూపర్ లగ్జరీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. ట్యాంక్‌బండ్ పై జరిగిన కార్యక్రమంలో కొత్త బస్సులకు మంత్రి జెండా ఊపారు. ప్రయాణికుల సౌకర్యార్థం పాత వాటి స్థానంలో కొత్త బస్సులను కోనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఆర్టీసీ వీటిని కొనుగోలు చేసింది.
రూ. 392 కోట్లతో 1,016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులకు ఆర్డర్ ఇచ్చారు. వాటిలో 50 బస్సులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన బస్సులు 2023 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయి.
ఈ బస్సుల్లో అత్యాధునిక సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతను దృష్ట్యా బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం ఏర్పాటు చేశారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్ బటన్‌ను నొక్కగానే కంట్రోల్ రూంకు సమాచారం అందుతుంది. తద్వారా అధికారులు వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటారు.