- డాక్టర్లు వస్తున్నారా ? ట్రీట్‌మెంట్ అందుతుందా ?
- డ్యూటీలకు రాని డాక్టర్లపై సస్పెన్షన్ వేటు, నిర్లక్ష్యంగా ఉండే వారికి వార్నింగ్‌లు
- ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న లీడర్లు, ఆఫీసర్లు
వరంగల్, వెలుగు : ఓరుగల్లులోని సర్కారు హాస్పిటల్స్‌పై ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఫోకస్ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల కారణంగా హాస్పిటల్స్‌కు భారీ సంఖ్యలో పేషెంట్లు వస్తున్నారు. దీంతో వారికి సరైన వైద్యం అందుతుందా ? లేదా అని తెలుసుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. దీంతో వైద్యసిబ్బంది ఉరుకులు, పరుగులు పెడ్తున్నారు.
ఎంజీఎంలో వైద్య సేవలపై ఆరా...
వరంగల్ సెంట్రల్ జైల్ స్థానంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామంటూ గత బీఆర్‌ఎస్ సర్కార్ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా మారిన ఎంజీఎం నిర్వహణను పట్టించుకోలేదు. దీంతో పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంజీఎంలో మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో హాస్పిటల్ సమస్యలపై సీఎం రేవంత్‍రెడ్డి మొదలు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ పలుమార్లు రివ్యూ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో అధికారులపై పలు ఫిర్యాదులు రావడంతో మంత్రి సురేఖ హాస్పిటల్‌ను తనిఖీ చేసి పనితీరు మార్చుకోవాలని సూచించారు. అలాగే వరంగల్ కలెక్టర్‌గా ఛార్జ్ తీసుకున్న సత్య శారదాదేవి సైతం ఎంజీఎంపై ఫోకస్ పెట్టారు. మొదటిసారి హాస్పిటల్‌కు తనిఖీకి వెళ్లిన కలెక్టర్ ఆఫీసర్లను సుతిమెత్తగా మందలించి, తెల్లారే మరోసారి సడన్‌గా తనిఖీ చేశారు. సుమారు 40 మంది డాక్టర్లు డ్యూటీలకు డుమ్మా కొట్టినట్లు తేలడంతో చర్యలకు ఉపక్రమించారు. ఓ డాక్టర్ ఏకంగా 25 రోజుల సంతకాలు ముందే పెట్టడంతో సస్పెన్షన్‌కు సిఫారసు చేశారు. అలాగే వారానికి కనీసం రెండు, మూడు సార్లు ఎంజీఎంలో పేషెంట్లకు అందుతున్న సేవలపై ఆరా తీస్తుండటంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు.
సస్పెన్షన్లు.. వార్నింగులు..
జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఎప్పుడు ఏ హస్పిటను తనిఖీ చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. వరంగల్ కలెక్టర్ సత్య శారద ఇప్పటికే ఎంజీఎంతో పాటు కాకతీయ మెడికల్ కాలేజీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వరంగల్ సీకేఎం హాస్పిటల్, నర్సంపేట జిల్లా హస్పిటల్, వర్ధన్నపేట ఆసుపత్రి, ఆయుర్వేద దవాఖానల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సైతం సిటీ పరిధిలోని హనుమకొండ మెటర్నటీ హాస్పిటల్ (జీఎంహెచ్) తనిఖీ చేసి సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. మూడు రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ మరోసారి కలెక్టర్‍తో కలిసి వరంగల్ ఐ హాస్పిటల్‌కు వెళ్లారు. వార్డులన్నీ తిరుగుతూ డ్యూటీల్లో లేని డాక్టర్లపై చర్యలకు ఆదేశించారు. హాస్పిటల్ చెత్త చెదారంతో నిండి ఉండడంతో సీరియస్ అయ్యారు.
డాక్టర్ల డ్యూటీ రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లాలోని సర్కార్ హాస్పిటల్స్‌పై ఫోకస్ చేసిన మంత్రులు, ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా డ్యూటీలకు డుమ్మా కొట్టే వారిని సస్పెండ్ చేస్తూ, నిర్లక్ష్యంగా ఉండేవారికి వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో పాటు హాస్పిటళ్లలో అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు విడుదల అయ్యేలా చూస్తున్నారు.