- రోడ్లు, ఇండ్లు, పరిహారం, దళితబంధు, పింఛన్ల కోసం ప్రశ్నిస్తున్న పబ్లిక్
- అందరికీ వస్తాయంటూ దాటవేస్తున్న లీడర్లు
వెలుగు, నల్గొండ: ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్న రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను సమస్యలపై జనం నిలదీస్తున్నారు. పలుచోట్ల అధ్వానంగా ఉన్న రోడ్లకు రిపేర్లు చేశాకే ఓట్ల కోసం రావాలని ముఖం మీదనే చెప్తున్నారు. పరిహారం ఇంకెప్పుడు వస్తదని నిర్వాసితులు ప్రశ్నిస్తుంటే, డబుల్ ఇండ్లు, దళితబంధు ఇచ్చేందుకు ఇంకెన్నాళ్లు పడ్తుందని సామాన్యజనం అడుగుతున్నారు. కాగా, విడతలవారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, అందరికీ స్కీములు అందజేస్తామంటూ లీటర్లు దాటవేస్తున్నారు.
నిలదీతలు.. దాటవేతలు..
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన సెగ తప్పడం లేదు. ఎక్కడికి వెళ్లినా జనం స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ లీడర్లను ఇరుకునపెడ్తున్నారు. రోడ్లు బాగాలేవని, డబుల్బెడ్రూం ఇండ్లు కడ్తలేరని, ఫించన్లు, దళితబంధు ఇస్త లేరని, ఉద్యోగాలు వస్తలేవని, ప్రాజెక్టుల కింద నష్టపరిహారం ఇస్తలేరని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లీడర్లను నిలదీస్తున్నవారిలో తెలంగాణ ఉద్యమకారులే ముందుంటున్నారు. అభ్యర్థిని వెంటబెట్టుకుని ఎన్నికల ప్రచారానికి పోతున్న లీడర్లకు సైతం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కు వచ్చిన జనం కూడా స్థానిక సమస్యలను సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఓ మహిళ చెప్పగా, చండూరును మున్సిపాలిటీ చేయడం వల్ల తమ గ్రామానికి ఒరిగిందేమీ లేదన్నారు. ట్యాక్సులు పెరిగాయి తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని మీడియా ఎదుట వాపోయారు. బుధవారం చౌటుప్పల్ మండలం తాళ్ల సింగారంలో ప్రచారం సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తనకు పింఛన్ రావట్లేదని ఓ మహిళ మొరపెట్టుకోగా, ‘ఈళ్లకిచ్చినం. ఆళ్లకిచ్చినం. ఇస్తమమ్మా. అందరికీ ఇస్తం. టైం పడ్తది.’ అంటూ వెళ్లిపోయారు. మరో మహిళ 'సార్ ఉండడానికి ఇల్లు లేదు.. దళితబంధు అన్నరు ఏమైంది?’ అంటూ ఇరుకున పెట్టారు. దీంతో 'వస్తయమ్మా అన్నీ ఒకేసారి కావు కదా’ అంటూ మంత్రి దాటవేశారు. మరోచోట ఓ మహిళ, తన కూతురిని కూలినాలి చేసి చదివిస్తే ఖాళీగా ఉంటోందని వాపోయింది. మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదపాక సైదులు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని నిలదీశాడు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చల్మెడ నుంచి గుజ్జా గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డుకు మరమ్మతులు చేస్తానని హామీ ఇచ్చి ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జోక్యం చేసుకొని పోలీసుల సాయంతో సైదులును పక్కకు తీసుకెళ్లారు. ఇక చండూరులో మంగళవారం జరిగిన మీటింగ్‌లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగానే మర్రిగూడ మండలం ఖుదాభక్షపల్లికి చెందిన భూ నిర్వాసితుడు అయితగోని జంగయ్య, ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. నెలలు తరబడి దీక్షలు చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే ప్రచారానికి రావాలని డిమాండ్ చేయడంతో టీఆర్ఎస్ అభ్యర్థి నీళ్లు నమిలారు.
ఇన్నాళ్లూ ఇటువైపు రాకపోవడం వల్లే..
మునుగోడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందిన తర్వాత నియోజకవర్గంపై టీఆర్ఎస్ సర్కారు వివక్ష చూపిందనే ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. ఎనిమిదేండ్లుగా మునుగోడు నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో అనేక సమస్యలు తిష్టవేశాయి. ఇన్నేండ్లలో ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టలేదు. డిండి, చర్లగూడెం, కిష్టరాయిని పల్లి, బ్రాహ్మణవెల్లెంల లాంటి ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో పడ్డాయి. రిపేర్లు చేయకపోవడంతో నియోజకవర్గంలోని రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. పరిహారం కోసం భూనిర్వాసితులు పోరాడుతూనే ఉన్నారు. ఇన్ని సమస్యలతో ప్రజలు బాధపడ్తున్నా అధికార పార్టీకి చెందిన లీడర్లు ఇన్నాళ్లూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. తీరా ఇప్పుడు ఓట్ల కోసం వస్తుండడంతో పలువురు ఆయా సమస్యలపై లీడర్లను నిలదీస్తున్నారు.