
- రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ
- సన్నబియ్యం చూసి మురిసిన జనం.. క్వాలిటీగా ఉన్నాయని కితాబు
- రాష్ట్ర ప్రజలకు ఏటా రూ.10 వేల కోట్లకు పైగా లబ్ధి
నెట్వర్క్, వెలుగు:రాష్ట్రంలోని పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. బియ్యం క్వాలిటీ బాగున్నాయని, ఇలాంటి బియ్యం ఇస్తారని అసలు ఊహించలేదని సంబురపడ్డారు. ఉగాదిరోజు సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా, రాష్ట్రవ్యాపంగా మంగళవారం నుంచి రేషన్ షాఫుల్లో సన్న బియ్యం పంపిణీ మొదలైంది.
రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్న సమాచారంతో జనం ఉదయం నుంచే షాపుల వద్ద బారులు తీరారు. సర్కారు ఇచ్చిన సన్న బియ్యం చూసి ఖుష్అయ్యారు. బియ్యం బాగుంటాయో లేదోనని అనుమానపడ్డామని, కానీ బయట మార్కెట్లో ఉన్నట్లే మంచిగా ఉన్నాయని సంతోషం వ్యక్తంచేశారు.
ఇన్నిరోజులు రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల వాటిని తాము తినలేకపోయామని, బయట కిలోకు రూ.10 చొప్పున అమ్ముకున్నామని, ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నందున ఇకపై అమ్ముకోమని చెప్పారు. ‘‘మా ఇంట్లో నలుగురం ఉంటాం.. ప్రతి నెలా 24 కిలోల బియ్యం వస్తాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రేషన్ కార్డుపై దొడ్డు బియ్యమే ఇచ్చేవాళ్లు. వాటిని బయట అమ్ముకొని సన్నబియ్యం కొనుక్కొనేవాళ్లం. ఇప్పుడు సర్కారే సన్నబియ్యం ఇస్తున్నందున మాకు నెలకు రూ.1200 దాకా మిగులుతాయి’’ అని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన -చౌడవరపు సోమలక్ష్మి తెలిపారు.
ఒక్కో కుటుంబానికి ఏటా రూ.14 వేలు మిగులు
ప్రస్తుతం రాష్ట్రంలో 90.41 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందుతున్నాయి. మొత్తం 2.85 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. కొత్తకార్డులు వస్తే లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరుతుంది. వీరందికీ 6 కిలోల చొప్పున ప్రతి నెలా 1.86 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని సర్కారు పంపిణీ చేయనున్నది. ఇన్నిరోజులు దొడ్డు బియ్యం సప్లై చేయడం వల్ల దాదాపు 80 శాతం మంది వీటిని బయట అమ్ముకునేవారు.
దీని వల్ల దళారులు, మిల్లర్లు రీ సైక్లింగ్చేసి కోట్లకు పడగెత్తగా, జనం మాత్రం బయట రూ.45 నుంచి రూ.50కి కిలో చొప్పున సన్నబియ్యం కొని తినేవారు. ఇప్పడు సర్కారే సన్నబియ్యం పంపిణీ చేస్తుండడం వల్ల నలుగురు ఉన్న ఒక్కో కుటుంబానికి ప్రతి నెలా రూ.1200 చొప్పున ఏటా రూ.14,400 దాకా మిగలనున్నాయి. మొత్తం మీద సన్నబియ్యం స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు రూ. 10 వేల కోట్లకు పైగా ఆదా అవుతాయని, మరే స్కీమ్ ద్వారా ఈ స్థాయిలో లబ్ధి జరిగే అవకాశం లేదని సివిల్ సప్లైశాఖ అధికారులు చెప్తున్నారు.
కేంద్రం గుర్తించింది 54 లక్షల కార్డులే..
ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల 41 వేల 953 రేషన్‌కార్డులు ఉండగా, వీటిలో కేవలం 54 లక్షల 65 వేల 906 కార్డులను మాత్రమే కేంద్రం గుర్తించింది. దీంతో మిగిలిన 35 లక్షల 76 వేల 47 రేషన్‌కార్డులకు సరఫరా చేస్తున్న బియ్యం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరిస్తున్నది. ప్రస్తుతం బియ్యం పంపిణీ కోసం ఏటా రూ.13,523 కోట్లు ఖర్చు చేస్తుండగా, ఇందులో కేంద్రం రూ.5,489 కోట్లు భరిస్తుండగా, రాష్ట్రం తన వాటా కింద రూ.8,033 కోట్లు ఖర్చు చేస్తున్నదని ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
క్వాలిటీ బాగుంది
ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం క్వాలిటీ చాలా బాగుంది. బయట కొనుక్కున్న బియ్యం లాగే ఉన్నయ్. టేస్ట్ కూడా బాగుంది. సన్నబియ్యం పంపిణీ చేయడం వల్ల ఒక్కో కుటుంబానికి చాలా డబ్బులు మిగులుతయ్. వాటితో ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. థాంక్యూ సీఎం రేవంత్ సార్.
- మడూరి ప్రణతి, వరంగల్
ఇక బియ్యం బయట కొనాల్సిన పనిలేదు
నాకు అంత్యోదయ కార్డు ఉంది. ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం చాలా బాగున్నాయి. పోయిన నెలదాకా ఇచ్చిన దొడ్డు బియ్యం తినలేక బయట బియ్యం కొనుక్కునేవాళ్లం. ఇక నుంచి బియ్యం బయట కొనాల్సిన పనిలేదు. నాకు 35 కిలోలు సన్నబియ్యం వచ్చినయ్. నెలకు రూ.1500 దాకా ఆదా అవుతున్నాయి.
- గడ్డం లక్ష్మి, కారేపల్లి, ఖమ్మం జిల్లా
సన్న బియ్యం మంచిగున్నయ్
సన్నబియ్యం మంచిగున్నయ్. నాలాంటి ముసలోళ్లకు
15–-20 రోజుల వరకు ఇబ్బంది లేదు. దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు బాతులోళ్లు వాటికి దాణా కోసం ఇవ్వమని వచ్చేది. కొందరు బియ్యం తెచ్చుకోవడం ఇష్టంలేక కోపన్ దుకాణం వాళ్లకే ఇచ్చేసేది. ఇప్పుడు అట్లా ఎవరు ఇడిసిపెట్టరు.
- సూత్రపు సాంబలక్ష్మి, దీక్ష కుంట, నెక్కొండ , వరంగల్ జిల్లా
సన్నబియ్యం తినాలనే కోరిక తీరింది
మేం కూలి చేసుకొని బతుకుతున్నం. ఇంట్లో ఆరుగురం ఉంటం. ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చేది. ఆ బియ్యం అన్నం వండితే ముద్ద అయ్యేది. సన్నబియ్యం కొనే స్థోమత లేక అదే అన్నం తిన్నం. ఇప్పుడు రేషన్ షాపుల సన్నబియ్యం పోస్తున్నరు. బియ్యం మంచిగున్నయి, సన్నబియ్యం తినాలనే కోరిక తీరుతున్నది. ఈ సర్కారు మేలును మాలాంటి పేదోళ్లం మర్చిపోం.
- సమ్మక్క, ఏసీసీ కాలనీ, మంచిర్యాల జిల్లా
ఇంతమంచి బియ్యం ఇస్తరనుకోలే
అన్నపూర్ణ కార్డు కింద నాకు 35 కిలోల బియ్యం ఇచ్చిన్రు. ఇంతకుముందు ఇచ్చే దొడ్డు బియ్యం తినలేకపోయేవాళ్లం. ఇప్పుడు ఇచ్చిన సన్నబియ్యం మంచి క్వాలిటీ ఉన్నయ్. అన్నం కూడా రుచిగా ఉంది. ఇంతమంచి బియ్యం ఇస్తరని అనుకోలె.
- తోడేటి సీత, మేళ్ల చెరువు, సూర్యాపేట జిల్లా
ఇకనుంచి బియ్యం అమ్ముకోం
ఇంతకు ముందు ఇచ్చిన దొడ్డు బియ్యం తినలేక సన్న బియ్యం కొనుక్కునేదాన్ని. నెలకు రూ. వెయ్యి ఖర్చయ్యేది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తరని తెలిసినా అవి కూడా బాగుంటయో లేదోనని అనుకున్న. షాపుల్లో కొనే సన్నబియ్యం లాగే ఉన్నయ్. అన్నం కూడా బాగుంది. ఇప్పటి నుంచి బియ్యం అమ్ముకోను. ఇవే తింట.
- ధీకొండ నాగేంద్రమ్మ, మేళ్లచెరువు, సూర్యాపేట జిల్లా