ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు.. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దలు.. మండిపడ్డ మంత్రులు, పీసీసీ చీఫ్

ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు.. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దలు.. మండిపడ్డ మంత్రులు, పీసీసీ చీఫ్
  • బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే 
  • కాంట్రాక్టర్లు కూలిస్తే కూలే ప్రభుత్వం కాదు: మహేశ్ గౌడ్ 
  • కేసీఆరే మాట్లాడించినట్లుంది : పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి
  • పడగొడతామంటే చూస్తూ ఊరుకోం: పొన్నం 
  • విచారణ జరిపించాలి: అద్దంకి 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతున్నది. ‘బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు’ అంటూ ఆయన చేసిన కామెంట్లపై మంత్రులు, పీసీసీ చీఫ్ మండిపడ్డారు. ఇవి బీఆర్ఎస్ పెద్దలు చేయించిన వ్యాఖ్యలేనని, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతున్నదని అన్నారు. తమ సర్కార్‌‌‌‌‌‌‌‌పై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ఎమ్మెల్యేల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని తెలిపారు. 

కాంట్రాక్టర్లు కూలుస్తామంటే కూలిపోయే ప్రభుత్వం తమది కాదని, ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​ గౌడ్​ హెచ్చరించారు. కాగా, సోమవారం తొగుటలో జరిగిన బీఆర్ఎస్ ​కార్యకర్తల సమావేశంలో కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్​పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు.. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ మమ్మల్ని అడుగుతున్నారు. ఇందుకోసం ఎంత డబ్బయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ముందుకొస్తున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, అందుకు ఖర్చును కూడా భరిస్తామని చెబుతున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు.  

మొదటి నుంచి అంతే..  

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సర్కార్ పడిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండ్రోజుల నుంచే వాళ్లు తమ నోటికి పని చెప్పారు. ప్రభుత్వానిది మూణ్నాళ్ల ముచ్చటేనంటూ ఆదిలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి వ్యాఖ్యానించారు. ఓ అడుగు ముందుకేసి బీఆర్ఎస్​ప్రభుత్వం అధికారం చేపడుతుందంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్​రావు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 23 మంది ఎమ్మెల్యేలు టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారంటూ నిరుడు కేసీఆర్​ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని, బీఆర్ఎస్​అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. తర్వాత కొన్నాళ్లూ ఇలాంటి కామెంట్స్ మానుకున్నా.. కొద్ది రోజులుగా మళ్లీ ప్రభుత్వం కూలిపోతుందని, కూల్చేయమంటున్నారని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉంది: మహేశ్​గౌడ్ 

కాంట్రాక్టర్లు కూల్చితే కూలే ప్రభుత్వం తమది కాదని పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్​అన్నారు. తమకు ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని చెప్పారు. కొత్త ప్రభాకర్​రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్​పదేండ్లు దోచుకున్నదని మండిపడ్డారు. అమ్ముడు, కొనుడుపై ఆ పార్టీకి అపార అనుభవం ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలంటే అంగట్లో సరుకులు కాదని, ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గౌరవం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోతారనే భ్రమలో ఆ పార్టీ ఉందన్నారు. 

ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదు: కొండా సురేఖ

ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. కాంగ్రెస్​సర్కారుపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. కాంట్రాక్టర్లతో బీఆర్ఎస్​పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్​అప్పులపాలు చేసిందని, వాళ్లు చేసిన అప్పులకే తాము మిత్తీలు కడుతున్నామని పేర్కొన్నారు. 

కేసీఆర్​ ఆత్మ మాట్లాడించింది: పొంగులేటి 

 కొత్త ప్రభాకర్​రెడ్డి వ్యాఖ్యలు.. కేసీఆర్​తన ఆత్మతో మాట్లాడించినట్టుగా ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతున్నదని ఆయన అన్నారు. దీనిపై విచారణ జరిపించేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని చెప్పారు. కొత్త ప్రభాకర్​రెడ్డి సొంతంగా ఇలా మాట్లాడి ఉంటారని అనుకోవడం లేదన్నారు. వేల కోట్లు ఎరవేసి రాజకీయం చేసేందుకు బీఆర్ఎస్​ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఎప్పుడూ వేసే పాత క్యాసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే బీఆర్ఎస్​వినిపిస్తున్నదని విమర్శించారు. 

నార్కో అనాలిసిస్​ టెస్ట్​ చేయాలి: అద్దంకి 

కొత్త ప్రభాకర్ రెడ్డికి నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్.. బీజేపీతో కలిసి గుజరాత్ వ్యాపారులతో ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేస్తున్నదన్నారు. సిగ్గూశరం లేకుండా ఏది పడితే అది మాట్లాడ్తున్నారని మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ చేయాలని, ఆయనతో నిజాలు చెప్పించాలని డిమాండ్​ చేశారు.

పడగొడుతామంటే చూస్తూ ఊరుకోం: పొన్నం

బీఆర్ఎస్​వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడుతుంటే, తాము చూస్తూ ఊరుకోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్​హెచ్చరించారు. కొత్త ప్రభాకర్​రెడ్డికి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్​బిజినెస్​ఉందేమోనని ఎద్దేవా చేశారు. ఆయనకు జ్యోతిషం బాగా తెలుసని, తమకు తెలియదని అన్నారు. పడగొడదాం రండి.. అంటే పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. వారం రోజుల్లో బీసీలను ఏకం చేయబోతున్నామని, బీసీ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీ బిల్లును అందరూ ఆమోదించాలన్నారు.