
- గుత్ప లిఫ్టు విస్తరణకు గ్రీన్‌సిగ్నల్
- అగ్రికల్చర్ డ్రిప్‌ల మంజూరుకు ప్రయారిటీ
- మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు
- నిజామాబాద్ లో రైతు మహోత్సవాలు ప్రారంభం
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ గిరిరాజ్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో మూడు రోజుల రైతు మహోత్సవాలను సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ప్రారంభించి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత పదేండ్ల నుంచి నిలిచిన ప్రాణహిత, చేవెళ్ల 20, 21, 21ఎ, 22 ప్యాకేజీల పనులకు రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని, పనులు వేగంగా సాగేలా చూస్తామని స్పష్టం చేశారు. 3 వేల ఎకరాలకు సాగునీరు అందించే గుత్ప లిఫ్ట్ స్కీమ్ విస్తరణకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లాలో చెక్ డ్యాంల నిర్మాణానికి టెక్నికల్ అడ్డంకులు లేకుంటే మంజూరు చేస్తామన్నారు. రెండు రోజుల్లో సన్న వడ్ల బోనస్ క్లియర్ చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగ్‌ల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎందరో లీడర్లను ఇచ్చిన నిజామాబాద్ జిల్లాకు స్టేట్‌లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
డ్రిప్ సిస్టంపై ఇజ్రాయెల్‌కు రైతులు..
1996--–97లో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి సమస్య తలెత్తినప్పుడు డ్రిప్ సిస్టం తెలుసుకునేందుకు ఇక్కడి రైతులను ఇజ్రాయెల్ దేశం పంపామని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్రావు గుర్తుచేశారు. సమర్థవంత సాగునీటి యాజమాన్య పద్ధతులతో రైతులు ఎకరానికి 50 బస్తాల వడ్లు పండించారని, ఇక నుంచి జిల్లా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ మంజూరులో ప్రయారిటీ ఇస్తామని వెల్లడించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ రూపురేఖలు మారుస్తామన్నారు. వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలందరూ రాజకీయాలు పక్కనబెట్టి జిల్లా వ్యవసాయం అభివృద్ధి, రైతు సమస్యలు ప్రస్తావించారు.
కొత్త ఆలోచనలు రేకెత్తించేలా..
లాభదాయకమైన పంటల సాగు, అనుబంధ పరిశ్రమల స్థాపన, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి ఇందూర్ గడ్డపై ప్రభుత్వం మూడు రోజుల రైతు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, సిద్ధిపేట ఐదు జిల్లా నుంచి రైతులు తరలి వచ్చారు. వారి కోసం మొత్తం 150 స్టాల్స్ ఏర్పాటు చేసి ఆహార పంటలు, ఉద్యనవనాలు, సుగంధ ద్రవ్యాలు, పంట విత్తనాలు, చేపల పెంపకం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఆదర్శ రైతులను రప్పించి వారి అనుభవాలు చెప్పిస్తున్నారు. అన్నదాతల అనుమానాలు తీర్చడానికి అగ్రికల్చర్ సైంటిస్టులు అందుబాటులో ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఉత్సవాలకు అటెండ్ అవుతున్న రైతులకు భోజనం, నీటి వసతి కల్పించారు. మొదటి రోజు ప్రారంభోత్సవం అట్టహాసంగా మంత్రులు, ఇతర ముఖ్యుల రాకతో మొదలైంది. మరో రెండు రోజుల పాటు కొనసాగే ప్రొగ్రామ్ రైతులలో ఆసక్తి పెంచుతున్నది.