- ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు.. పరిస్థితిపై అంచనా
- అన్ని ప్రభుత్వ శాఖలనుకలుపుకొని ముందుకు
నెట్వర్క్, వెలుగు: వర్షాలు, వరదలతో అవస్థలు పడుతున్న బాధితులకు మంత్రులు అండగా ఉంటున్నారు. అధైర్యపడొద్దని భరోసా ఇస్తున్నారు. రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు మొదలవగా.. పరిస్థితిని గమనించిన మంత్రులు తమ ఇతర పర్యటనలు రద్దు చేసుకొని జనంలోనే ఉంటున్నారు. బాధితులకు కావాల్సిన సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మినిస్టర్లంతా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ.. అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా వరదలతో తీవ్ర ముంపుకు గురైన ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో మంత్రులు దగ్గరుండి సహాయ చర్యలు చేపడ్తున్నారు. బాధితుల కష్టాలు అడిగితెలుసుకుంటున్నారు. దెబ్బతిన్న రోడ్లు, నీట మునిగిన ఇండ్లు, ఇసుకమేటలు వేసిన పంటపొలాలు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం బాధితులకు అవసరమైన సహాయాన్ని అందజేస్తుందని చెప్తున్నారు.
ఖమ్మం జిల్లాలో భట్టి, తుమ్మల, పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మూడురోజులుగా పర్యటిస్తున్నారు. శనివారం సాయంత్రం తన ఇతర పర్యటనలను రద్దు చేసుకొని.. ఖమ్మం జిల్లాకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. సోమవారం మంత్రి తుమ్మల ఖమ్మంలోని బొక్కల గడ్డ, మోతె నగర్, వెంకటేశ్వర నగర్, దంసలా పురం,కవిరాజు నగర్, ప్రకాశ్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఖమ్మం రూరల్ మండలంలోని నాయుడుపేట, జలగం నగర్, సాయి ప్రభాత్ నగర్, పెద్దతండా, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో బాధితులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓదార్చారు.
వచ్చే వానాకాలం నాటికి మున్నేరు వరదతో ఇబ్బంది లేకుండా కాంక్రీట్ వాల్ ను కంప్లీట్ చేస్తామని చెప్పారు. అంతకు ముందు టూవీలర్ పై వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో పొంగులేటి కాలికి గాయమైంది. బైక్ ఫుట్ రెస్ట్ తాకడంతో మోకాలి కింది భాగంలో గాయం కాగా.. తర్వాత డాక్టర్లు ట్రీట్ మెంట్ చేసి కట్టుకట్టారు. కూసుమంచి మండలంలో ఆదివారం గల్లంతైన దంపతుల్లో భర్త యాకూబ్ మృత దేహం సోమవారం దొరికింది. ఆ మృతదేహం వద్ద మంత్రి పొంగులేటి నివాళులర్పించి.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. జక్కేపల్లిలో నీట మునిగిన వరి పంటను ఆయన పరిశీలించారు.
Also Read :- పంట నష్టం కింద ఎకరాకు 10 వేలు
కోదాడలో మంత్రి ఉత్తమ్
సూర్యాపేట జిల్లా కోదాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించారు. తమ్మరవాగు బ్రిడ్జి, పాలేరు వాగు బ్రిడ్జిని సోమవారం ఆయన పరిశీలించారు. ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని, వరదలతో నష్టపోయిన కుటుంబాలను పరిహారం అందజేస్తామని చెప్పారు.
మహబూబాబాద్‌లో సీతక్క
ఆదివారం కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోని వరద బాధితులకు మంత్రి సీతక్క దగ్గరుండి సహాచర్యలు చేపడ్తున్నారు. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద కొట్టుకుపోయిన రోడ్డును సోమవారం ఆమె పరిశీలించారు. సీరోలు మండలం సీతారామ్ నాయక్ తండా వద్ద పునరావాసకేంద్రంలో వరద బాధితులను పరామర్శించారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. కేసముద్రం మండలంలో వివిధ ప్రాంతాలను పరిశీలించారు.