- సమస్యలు పరిష్కరించాలని కోరిన ప్రజలు
- ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే చేస్తామని హామీ
యాదాద్రి, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లో బుధవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించారు. ఎక్కడికక్కడ రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం చేశారు. సంస్థాన్ నారాయణపురంలో వాల్మీకి బోయలతో మంత్రి గంగుల కమలాకర్ మీటింగ్ నిర్వహించారు. ఇదే మండలంలోని పలు తండాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం చేయగా, చౌటుప్పల్ మున్సిపాలిటీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం సహా పలు సమస్యలను ఓటర్లు గుర్తు చేయగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఎలాంటి పనులు చేయలేమని చెప్పారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్యాండిడేట్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని, ఆ తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టేందుకు బీజేపీ ఉప ఎన్నికలను తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా ఆపార్టీకి బుద్ధి చెప్పాలని సూచించారు.
పద్మశాలి కులానికి చెందిన ఓటర్లను కలిసి చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలంటూ ప్రధాని మోడీకి పోస్ట్ కార్డులు పంపించాలని సూచించారు. గౌడ ఓటర్లను కలిసి కల్లును నిషేధించడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని చెప్పారు. మహిళ సంఘాలతో నిర్వహించిన మీటింగ్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే చౌటుప్పల్ మండలం డి.నాగారంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ముఠా గోపాల్, వివేకానంద, సుధీర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఉన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ వెహికల్ తనిఖీ మునుగోడు ఉపఎన్నికలో ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కారును పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీ చేశారు.