- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై బూతు పురాణం, దాడికి యత్నం
- కరీంనగర్ జిల్లా రివ్యూ మీటింగ్‌లో హుజూరాబాద్ ఎమ్మెల్యే దౌర్జన్యం
- ‘కడుపుకు అన్నం తింటున్నవారా’ అంటూ దుర్భాషలు
- గ్రంథాలయ చైర్మన్, అడిషనల్ కలెక్టర్‌పైనా దురుసు ప్రవర్తన
కరీంనగర్, వెలుగు: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రెచ్చిపోయారు. అధికారిక కార్యక్రమంలో, మంత్రుల సమక్షంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌పై ఆయన బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఈ ఘటన జరిగింది. సంజయ్ మైక్ తీసుకుని మాట్లాడబోతుండగా.. అడ్డుతగిలి ‘‘సిగ్గులేనోడా.. కడుపుకు అన్నం తింటున్నవారా’’ అంటూ పాడి కౌశిక్ దుర్భాషలాడారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభమైనప్పటి నుంచే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన నోటి దురుసును ప్రదర్శించారు. అతిథులంతా వేదికపైకి ఎక్కే క్రమంలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో ఆయన గొడవకు దిగారు. గ్రంథాలయ చైర్మన్‌ను వేదికపైకి ఎలా పిలుస్తారని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌పై కౌశిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రొటోకాల్ ప్రకారమే వచ్చానని, తాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ని అంటూ మల్లేశం కౌంటర్ ఇచ్చారు. ప్రొటోకాల్ ప్రకారమే ఆయనను పిలిచినట్లు అడిషనల్ కలెక్టర్ సమాధానమివ్వడంతో ఆ వివాదం సద్దుమణిగింది.
అయితే.. సమావేశంలో తన వంతు రాగానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడేందుకు లేచారు. ఇంతలో కౌశిక్ రెడ్డి కలుగజేసుకుని.. ‘‘నీది ఏ పార్టీ. ఈయనను ఎలా మాట్లాడనిస్తున్నరు” అంటూ అడ్డుకున్నారు. పదేపదే ఆయనను ప్రశ్నించడంతో తాను కాంగ్రెస్ పార్టీ అని సంజయ్ స్పష్టం చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి.. బూతుపురాణం మొదలుపెట్టారు. ‘‘ఏందిరా బై ఏంది. బాడ్ కవ్.. కేసీఆర్ బిచ్చమేస్తే గెలిచినవ్ రా.. ఫాల్తుగా. అన్నం తింటున్నవారా.
సిగ్గు లేదారా..” అంటూ నోటికొచ్చినట్లు పాడి కౌశిక్ రెడ్డి దుర్భాషలాడారు. అక్కడున్న మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు.. తిట్టడం పద్ధతి కాదని ఎంత వారించినా వినలేదు. పైగా సంజయ్పైకి కౌశిక్‌రెడ్డి దాడి చేసేందుకు దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశారు. ఈ క్రమంలో పోలీసులతోనూ ఆయన దురుసుగా ప్రవర్తించారు. కౌశిక్ రెడ్డి తీరుతో జిల్లా సమీక్ష సమావేశంలో ఉద్రిక్తత ఏర్పడింది.
కౌశిక్ బూతులను బీఆర్ఎస్ సమర్థిస్తుందా?: పొన్నం
పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడిన బూతులను బీఆర్ఎస్ అధిష్టానం సమర్థిస్తుందా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ‘‘పార్టీలు మారని వారు, జీవిత కాలం ఒకే పార్టీలో ఉన్నవారు ఫిరాయింపుల గురించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుండే. కానీ.. నాడు వైఎస్సార్సీపీలో ఉండి తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు రువ్విన వ్యక్తి పాడి కౌశిక్‌రెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి అవకాశాలు పొంది.. మళ్లీ బీఆర్ఎస్లోకి పోయిండు.
ఆయన మాట్లాడిన తీరుపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు స్పందించాలి. ఇలాంటి సంఘటనలు సమర్థిస్తున్నరా? ఎంకరేజ్ చేస్తున్నరా? ఇలాంటివాళ్లకు ఆదర్శంగా మీరు బూతు మాటలు మాట్లాడే స్కూల్ పెట్టుకున్నరా? ఇది మంచి పద్ధతి కాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్న. సమీక్షకు లైబ్రరీ చైర్మన్ వస్తే ఆయనను ఎలా పిలుస్తారని జాయింట్ కలెక్టర్ ను పాడి కౌశిక్ బెదిరించిండు. ఇది డెమోక్రసీ. ప్రభుత్వంలో ఉండే అందరినీ పిలుస్తరు” అని తెలిపారు.
ముందు కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయాలి: సంజయ్
కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బదులిస్తూ.. పార్టీ ఫిరాయిం పులను గతంలో ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ ముందుగా రాజీనామా చేయా లని డిమాండ్ చేశారు. తాను జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తానని, త్వరలో పార్టీలో చేరతానని ఆయన మీడియాతో అన్నారు.
కౌశిక్ ప్రవర్తన మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు: శ్రీధర్ బాబు
ఎమ్మెల్యే సంజయ్‌ని కౌశిక్ రెడ్డి అసభ్య పదజాలంలో దూషించడం సరికాదని.. ప్రవర్తన మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. బీఆర్ఎస్ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు తమకు కనీసం మాట్లాడే అవకాశం కూడా దొరకలేదన్నారు. పోలీసులపై దాడికి దిగిన ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇలాంటి గూండాయిజాన్ని ఎన్నడూ చూడలే: ఉత్తమ్
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేయడాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. జిల్లా అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు అడిగే వేదికపై రాజకీయాలు ఏంటని ఆయన మండిపడ్డారు. సమావేశాన్ని డైవర్షన్ చేసేందుకే ఇలా కుట్ర చేశారన్నారు. ఇలాంటి రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని తాము గతంలో చూడలేదని.. తమ పార్టీ ఇలాంటి చర్యలని ఉపేక్షించదని స్పష్టం చేశారు.