- మిర్యాలగూడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేలకు మంత్రుల భరోసా
- హరీశ్, జగదీశ్సంకేతాలతో కేడర్‌లో తొలిగిన అనుమానాలు
నల్గొండ, వెలుగు నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్ అయింది. శుక్రవారం మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్న మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి వచ్చే ఎలక్షన్లో మళ్లీ ఎన్. భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డిలే పోటీ చేస్తారని సంకేతాలు ఇచ్చారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు వచ్చే ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆ ఎమ్మెల్యేల సీట్లకు ఢోకా లేదని తేలిపోయింది.
పెద్దల పర్యటన పైనే ఆశలు..
ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద లీడర్ల పర్యటనపైనే ఆశలు పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు వీళ్లలో ఎవరో ఒకరు తమ నియోజకవర్గంలో పర్యటించి అండగా నిలిస్తే చాలని ఎమ్మెల్యేలు ఆశ పడుతున్నారు. జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలు కావడంతో ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులపైన నమ్మ కం పెట్టుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల వైఖరి పైన ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తుండటంతో టెన్షన్ పడుతున్నారు. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే కేటీఆర్, హరీశ్‌రావును రప్పించి ప్రజల్లో నమ్మకం కలిగిస్తే బయటపడ్తామని భావిస్తున్నారు. తద్వారా పార్టీలో నెలకొన్న విభేదాలు వీడి అందరు ఏకతాటిగా పైకొచ్చి పనిచేస్తారని అనుకుంటున్నారు. శుక్రవారం మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌లో జరిగిన సభల్లో హరీశ్‌రావు ఈ తరహా కామెంట్లే చేశారు. విభేదాలు పక్కన పెట్టి అభివృద్ధి అనే అస్త్రాన్ని ప్రతిపక్షాల పైన ప్రయోగించాలని పిలుపునిచ్చారు. అట్లయితనే ఉమ్మడి జిల్లాలో 12 స్థానాల్లో గెలుపు సాధ్యమని చెప్పారు. సిద్దిపేట, సూర్యాపేటతో పోలిస్తే మిర్యాలగూడకే ఎక్కువ నిధులు ఇచ్చామని, కాబట్టి వచ్చే ఎలక్షన్లలో భాస్కర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇక హుజూర్నగర్ సభలో సైదిరెడ్డి గెలుపునకు 50 వేల మెజార్టీ టార్గెట్ పెట్టారు. ఎంపీ ఉత్తమ్ వచ్చే ఎన్నికల్లో 50వేల మెజార్టీ రాకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో సైదిరెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపించాలని చెప్పడం ద్వారా ఇటు ఉత్తమ్‌కు సవాల్ చేసినట్టయ్యింది. ను దెబ్బతీయడమేగాక, సైదిరెడ్డి టికెట్ కూడా పక్కా అనితేలిపోయింది. జనవరిలో హుజూర్‌నగర్‌లో కేటీఆర్ వచ్చినప్పుడు కూడా సైదిరెడ్డి టికెట్ కనఫర్మ్ అనే సంకేతాలే ఇచ్చారు. తాజాగా హరీశ్, జగదీశ్‌రెడ్డిలు హామీ ఇ వ్వడంతో పార్టీ కేడర్‌లో అనుమానాలు తొలిగిపోయనట్లుగానే భావిస్తున్నారు.
మిర్యాలగూడ సీటు సీపీఎంకు లేనట్లే?
కమ్యూనిస్టుల పొత్తుల భాగంగా మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌లో ఏదో ఒ క సీటు సీపీఎంకు ఇస్తారని ప్రచారం జరిగింది. మిర్యాలగూడ సీటు తమ దేనని సీపీఎం అగ్రనేతలు ప్రకటించారు. పొత్తులో భాగంగా నిజంగానే సీపీఎంకు ఇవ్వాల్సి వస్తే తన సీటు త్యాగం చేస్తానని భాస్కర్‌రావు కూడా అన్నారు. దీని పైన పార్టీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో భాస్కర్‌రావు తన అభిప్రాయాన్ని మార్చుకుని మిర్యాలగూడ నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. దీంతో సీపీఎం ఫోకస్ హుజూర్నగర్ పైన పడింది. తాజాగా హుజూర్‌నగర్‌లో కూడా బీఆర్ఎస్సే పోటీ చేస్తదని మంత్రుల ప్రకటనతో ఇప్పుడు సీపీఎం ఇరకాటంలో పడింది. త్వరలో నల్గొండ, మిర్యాల గూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన కూడా ఉందని ఎమ్మెల్యేలు చెపుతున్నారు. ఈ పర్యటన కోసం నల్గొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు ఆశగా ఎదురుచూస్తున్నారు.